జమ్ముకశ్మీర్ లో పెరిగిన ఉగ్రదాడులు.. 32 నెలల్లో 48 మంది జవాన్లు వీరమరణం

by Shamantha N |
జమ్ముకశ్మీర్ లో పెరిగిన ఉగ్రదాడులు.. 32 నెలల్లో 48 మంది జవాన్లు వీరమరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. జమ్ము ప్రాంతంలో గత 32 నెలల్లో మొత్తం 48 మంది జవాన్లు అమరులయ్యారు. దోడా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక అధికారి సహా నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు, భద్రతాసిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆర్మీ అధికారితోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైందని, భారీ కాల్పులు జరిగాయని ఇండియన్‌ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ముష్కరుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది. కాగా.. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన కశ్మీర్‌ టైగర్‌ ప్రకటించింది. మరోవైపు, వారం రోజుల్లో జమ్ము రీజియన్‌లో జరిగిన రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌ ఇది. గతవారం కతువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.

ఇటీవల జరిగిన దాడులు

జూలై 16, 2024: దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సైనికులు కన్నుమూశారు.

జూలై 8, 2024: కతువా జిల్లాలో మిలిటరీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరగడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.

జూన్ 12, 2024: రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.

జూన్ 9, 2024: రియాసీలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో, బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో తొమ్మిది మంది చనిపోయారు. మరో 33 మంది గాయపడ్డారు.

మే 4, 2024: పూంచ్ జిల్లాలో రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు.

డిసెంబర్ 21, 2023: జమ్ములో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు సైనికులు మరణించారు.

నవంబర్ 2023: ఎన్ కౌంటర్ లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు చనిపోయారు.

ఏప్రిల్-మే 2023: ఉగ్రవాదులు జరిపిన జంట దాడుల్లో 10 మంది సైనికులు అమరులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed