కొత్త క్రిమినల్ చట్టాలపై 40 లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ

by S Gopi |
కొత్త క్రిమినల్ చట్టాలపై 40 లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వచ్చే వారం నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా 40 లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చారు. చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై వీటి ప్రభావం గురించి అవగాహన కల్పించినట్టు అధికారిక వర్గాలు బుధవారం తెలిపారు. గతేడాది కేంద్రం భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్యా అధినియం 2023 వంటి కొత్త చట్టాల గురించి 5.65 లక్షల మంది పోలీసులు, జైలు, ఫోరెన్సిక్స్, జ్యుడీషియల్, ప్రాసిక్యూషన్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాలు వరుసగా బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో పనిచేయనున్నాయి. కొత్త క్రిమినల్ చట్టాలు దర్యాప్తు, విచారణ, కోర్టు విచారణలలో సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చినందున, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రస్తుతం ఉన్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌లు అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) అప్లికేషన్‌లో 23 మార్పులు చేసింది. దీని ద్వారా దేశంలోని ప్రతి పోలీసు స్టేషన్‌లో అన్ని కేసులు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎన్‌సీఆర్‌బీ కొత్త వ్యవస్థ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తోంది. కొత్త క్రిమినల్ చట్టాల అమలులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిరంతరం సాయమందించేందుకు 36 సహాయక బృందాలు, కాల్ సెంటర్‌లను ఏర్పాటు చేసింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్అండ్‌డీ) సామర్థ్యం పెంపుదల కోసం శిక్షణా మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా 250 శిక్షణా కార్యక్రమాలు, వెబ్‌నార్స్‌, సెమినార్‌లను కూడా నిర్వహించింది, ఇందులో 40,317 మంది అధికారులు, సిబ్బంది శిక్షణ పొందారు.

Advertisement

Next Story

Most Viewed