పేపర్ లీకేజీపై నాలుగు దశల్లో సీబీఐ దర్యాప్తు

by S Gopi |
పేపర్ లీకేజీపై నాలుగు దశల్లో సీబీఐ దర్యాప్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల స్వాధీనం చేసుకున్న సీబీఐ ప్రాథమిక ఆధారాల సేకరించిన అనంతరం మరింత సమగ్రంగా దర్యాప్తును కొనసాగించనుంది. అందుకోసం నాలుగు దశల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, దేశంలోని ఎగ్జామ్ సెంటర్లకు ఎలా పంపించారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎన్‌టీఏ నిబంధనల అమలు, ఉల్లంఘన జరిగిన అంశాలు, టెక్నాలజీ బ్రీచ్ వంటి విషయాల ఆధారంగా విచారణ జరగనుంది. ఇవి కాకుండా, నీట్ ప్రశ్నాపత్రం రూపకల్పన నుంచి ప్రింటింగ్, రవాణా, పరీక్షల ముందు భద్రత వ్యవహారాలను చూసుకున్న వారిని అవసరానికి అనుగుణంగా విచారించనున్నారు. వారిపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వారి ద్వారానే ఏదొక దశలో ప్రశ్నాపత్రం బయటకు వెళ్లి ఉండొచ్చని సీబీఐ సందేహిస్తోంది. ఇది కేసుకు అత్యంత కీలకం. గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సుమారు 1,000 మంది పేర్లు, వారి ఫోన్ నంబర్లను సీబీఐ అధికారులు ట్రేస్ చేస్తున్నారు.

ప్రశ్న పత్రాల కోసం 7-లేయర్ ప్యాకేజీ, 2 తాళాలతో మెటల్ బాక్స్..

లీకేజీకి సంబంధించి ఎన్‌టీఏ జిల్లా కోఆర్డినేటర్ ప్రశ్నాపత్రాలు తారుమారు అయినట్టు అంగీకరించారు. మే 5న పరీక్ష జరిగిన హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ హెడ్ డా అహ్సానుల్ హక్ మాట్లాడుతూ.. బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించారని చెప్పారు. కేసును విచారించిన సమయంలో 7-లేయర్లతో ఉన్న ప్రశ్నాపత్రాల ప్యాకేజీ తారుమారు అయినట్టు ఆర్థిక నేరాల విభాగం అధికారులు గుర్తించారు. ఏడు లేయర్ల లోపల ట్యాంపరింగ్ జరిగినట్టు అహ్సానుల్ హక్ పేర్కొన్నారు. బయటి లేయర్లు చెక్కచెదరకుండా లోపలి వైపు ఎలా తారుమారు చేశారో స్పష్టంగా తెలియదు. బయటి లేయర్లలో ఒకటి రెండు సెట్‌ల తాళాలతో ఉండే మెటల్ బాక్స్ ఉంది. తాళాలలో ఒకటి డిజిటల్. ఇది పరీక్షకు రెండు గంటల ముందు తెరిచేలా ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటుంది. మరొకటి పెట్టెను తెరిచేందుకు ఫైల్‌తో కట్ చేయాలి.

Advertisement

Next Story

Most Viewed