శభాష్ అభిలాష్.. "గోల్డెన్ గ్లోబ్ రేస్‌" లో రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్‌కు 2వ స్థానం

by Mahesh |
శభాష్ అభిలాష్.. గోల్డెన్ గ్లోబ్ రేస్‌ లో రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్‌కు 2వ స్థానం
X

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ రేస్‌ (జీజీఆర్‌) ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్, కమాండర్ అభిలాష్ టోమీ చరిత్ర సృష్టించారు. 2022 సెప్టెంబర్ 4న ఫ్రాన్స్‌లోని లెస్ సాబుల్స్-డి ఒలోన్ నుంచి ప్రారంభమైన సోలో ఎరౌండ్-ది-వరల్డ్ సెయిలింగ్ రేస్‌లో ఆయన శనివారం రెండో స్థానంలో నిలిచారు. అభిలాష్ టోమీ 36 అడుగుల పొడవైన తన పడవ "బయానాట్" లో 236 రోజుల పాటు 30,000 మైళ్ళు జర్నీ చేసి.. శనివారం ఉదయం 10.30 గంటలకు ఫ్రాన్స్ తీరానికి చేరుకున్నారు. 44 ఏళ్ల అభిలాష్ టామీ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయుడు, ఆసియా వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. దక్షిణాఫ్రికాకు చెందిన 40 ఏళ్ల నావికుడు కిర్‌స్టెన్ న్యూషాఫర్‌ గురువారం రాత్రి నాటికే గమ్య స్థానానికి చేరుకొని మొదటి స్థానంలో నిలిచారు.

సముద్రంలో వాతావరణం సాఫీగా మారడంతో కిర్‌స్టెన్ తన చివరి 2-3 నాటికల్ మైళ్లను కవర్ చేయడానికి కొన్ని గంటల సమయం మాత్రమే పట్టింది. దీంతో ఇండియాకు చెందిన అభిలాష్ రెండో స్థానంలో నిలిచాడు.ఈ రేసులో మొత్తం 16 మంది పాల్గొన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేస్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీలలో ఒకటి. ఇప్పటివరకు ఈ పోటీలలో పాల్గొన్న 16 మంది మాత్రమే వారికి విధించిన టార్గెట్ ను పూర్తి చేయగలిగారు.

ఈ పోటీకి పెట్టిన ముఖ్యమైన నిబంధనలు ఏమిటంటే .. రేసులో పాల్గొనేవారు 1968కి ముందు నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించాలి. 32 నుంచి 36 అడుగుల పొడవు గల సాధారణ పడవను మాత్రమే వినియోగించాలి. సాంకేతిక వైఫల్యాలు, ప్రమాదాల కారణంగా 13 మంది మధ్యలోనే రేసు నుంచి విరమించుకున్నారు. దీంతో చివరకు పోటీలో ముగ్గురు మాత్రమే మిగిలారు.

2018లో అభిలాష్ కు ఏమైందంటే .. ?

2018 సంవత్సరంలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ రేసులోనూ అభిలాష్ పాల్గొన్నారు. అయితే హిందూ మహాసముద్రంలో అయన పడవ విరిగిపోయింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అభిలాష్ సముద్రంలో మూడు రోజులపాటు చిక్కుకుపోగా విమానం సహాయంతో రక్షించారు.ఫలితంగా అప్పట్లో మధ్యలోనే ఆయన పోటీ నుంచి వైదొలిగారు. అప్పటి రేసులో మొత్తం 18 మంది పాల్గొనగా.. వారిలో ఐదుగురు మాత్రమే రేసును పూర్తి చేయగలిగారు. పక్షవాతం నుంచి కోలుకున్న ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఘనత సాధించారు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ ఈ రేసులో పాల్గొన్న అభిలాష్ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. చిన్నప్పటి నుంచి బోట్‌ రేసింగ్‌పై ఆసక్తి, సైన్యంలో ఉండటం వల్ల అభిలాష్ టామీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారు.

Advertisement

Next Story

Most Viewed