ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

by John Kora |
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
X

- ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

దిశ, నేషనల్ బ్యూరో:

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దక్షిణ బస్తర్‌లోని తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళలు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఐదు బెటాలియన్ల కోబ్రా దళాలు, 229 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌కు వెళ్లారు. ఈ దళాలకు ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఎదురు పడటతో గన్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు 12 మంది మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు వివరించారు. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలకు ఎలాంటి నష్టం జరగలేదని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెలలోనే 26 మంది మావోయిస్టులు పలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. జనవరి 12న బీజాపూర్ జిల్లా మద్దేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. నిరుడు 219 మంది మావోయిస్టులు పలు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బీజాపూర్ జిల్లా భాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుత్కేలు అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిని రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Next Story

Most Viewed