కీలక ఘట్టానికి చేరుకున్న ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేదెవరు..?

by Anukaran |
కీలక ఘట్టానికి చేరుకున్న ఓట్ల లెక్కింపు.. మ్యాజిక్ ఫిగర్ చేరుకునేదెవరు..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రసవత్తరంగా మారింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇప్పటివరకు 66 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరామ్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉండగా, చివరకు ప్రధాన పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోదండరామ్‌ల మధ్య ప్రధాన పోటీ సాగనుంది. అయితే ఏ అభ్యర్థి ముందుగా మ్యాజిక్ ఫిగర్‌(1,83,167 ఓట్లు)ను చేరుకుంటారో వారినే గెలుపు వరించనుంది. వాస్తవానికి రెండో ప్రాధాన్యత ఓట్లపైనే తీన్మార్ మల్లన్న, కోదండరామ్‌లు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి 65,781 ఓట్లు అవసరం కాగా, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరామ్‌కు 1,04,057 ఓట్లు కావాల్సి ఉంది. మొదటి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతుండగా, రెండు మూడు స్థానాల్లో తీన్మార్ మల్లన్న, కోదండరామ్‌ ఉన్నారు. అయితే మల్లన్నకు కోదండరామ్ కు 12వేల పైచిలుకు ఓట్ల వ్యత్యాసం ఉంది. దీంతో రాములు నాయక్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్‌లో భారీగా రెండో ప్రాధాన్యత ఓట్లు వస్తే తప్ప.. కోదండరామ్ రెండో స్థానానికి రాలేరు. దీంతో తుది పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed