ముదిగొండ ఎస్సైపై వేటు

by Sumithra |

దిశ‌, ఖ‌మ్మం: పేకాట నిందితుల‌పై దాష్టీకం ప్రదర్శించారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఖ‌మ్మం జిల్లాలోని ముదిగొండ ఎస్సై స‌తీష్‌ కుమార్‌పై వేటు ప‌డింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 28న వనవారి క్రిష్టపురం గ్రామంలో పేకాట స్థావరాలపై సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పేకాట ఆడుతున్న న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిని నేల‌ మీద మోకాళ్ల‌పై నిల్చోబెట్ట‌డ‌మే కాకుండా ఇష్టానుసారంగా క‌ర్ర‌ల‌తో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసుల రాక్ష‌స‌త్వానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయ‌ంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై పోలీసుల వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ ప్ర‌ధాన మీడియాల్లోనూ పెద్ద ఎత్తున వార్త‌లు రావ‌డంతో ఉన్న‌తాధికారులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ప్రాథ‌మిక విచార‌ణ అనంత‌రం ఖ‌మ్మం క‌మిష‌న‌ర్ తఫ్సీర్ ఇక్బాల్.. సతీష్‌ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ ఘటనపై క్షేత్రస్ధాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాల‌ని స్థానిక రూరల్ ఏసీపీని ఆదేశించారు.

Tags: mudigonda, SI sathish kumar, card players, social media, AR head quarters, commissioner thapsir iqbal

Advertisement

Next Story