రేవంత్ వ్యూహం ఫలిస్తుందా..!

by Shyam |
రేవంత్ వ్యూహం ఫలిస్తుందా..!
X

దిశ, న్యూస్ బ్యూరో : గ్రేటర్​లో పొలిటికల్​ గేమ్​ షురువైంది.. ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ నేతలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​ గ్రేటర్​ ఎన్నికలను ఛాలెంజింగ్​గా తీసుకోగా, టీఆర్​ఎస్​ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్​ పరిధిలోని 48 స్థానాలు పార్టీ బలాబలాలను నిర్ణయించే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల గురి వాటిపైనే ఉన్నాయి.. రేవంత్​కు సొంతగూటిలోనే కుంపటి రాసుకుంటుండగా, ఆజ్యం పోసే పని టీఆర్​ఎస్​ తీసుకున్నదనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు వ్యూహాలు మొదలుపెట్టాయి. గత ఎన్నికల్లో మాదిరిగానే వంద సీట్లను గెలవాలని అధికార పార్టీ భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. అదే సమయంలో బలం పెంచుకోవాలని కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో 48 రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానం పరిధిలోనే ఉండడంతో వ్యక్తిగతంగా ఆయనకు చాలెంజింగ్​ రోల్​. అందుకే అభ్యర్థుల ఎంపిక మొదలు గెలుపు వరకు ఎంపీగా పార్టీ తరఫున తన పాత్రను పోషించాలనుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలు, ప్రజాదరణ ఉన్న స్థానిక నేతలు తదితరాలపై చేసిన సర్వే ఫలితాల అధ్యయనం మొదలైంది.

మల్కాజిగిరి ఎంపీ గానే కాకుండా రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావడంతో రేవంత్‌రెడ్డి తనదైన వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార పార్టీ తరఫున మంత్రి కేటీఆర్‌కు మాత్రమే కాక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌కు కూడా ప్రతిష్టాత్మకం. ఒకరకంగా ఈ ఎన్నికలు కేటీఆర్ వర్సెస్ రేవంత్‌గా మారనున్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలు ఎలా ఉన్నా గ్రేటర్ ఎన్నికలు మాత్రం భిన్నంగా ఉండనున్నాయి.

50 డివిజన్లపై స్పెషల్ ఫోకస్ ఎందుకంటే..?

గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లలో 50 ఓల్డ్ సిటీలో ఉన్నాయి. వీటిలో దాదాపు మజ్లిస్ పార్టీకే ఎక్కువ పట్టు ఉంది. మిగిలిన 100 డివిజన్లలో 48 మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అంటే దాదాపు సగం డివిజన్లు రేవంత్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలోకే వస్తాయి. గ్రేటర్‌లో పాగా వేయాలంటే ఏ పార్టీకైనా ఈ స్థానాలు అతి కీలకం. టీపీసీసీ చీఫ్ అవకాశాలున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి గ్రేటర్ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకం. గ్రేటర్ ఎన్నికలంటే ముందే పీసీసీ చీఫ్ అయినట్లయితే అత్యధిక స్థానాల్లో గెలిచి నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చినట్లవుతుంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ ప్రకటించే అవకాశం ఉన్నా ఈ డివిజన్లలో గెలుపు రేవంత్‌కు కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

ఈ డివిజన్లలోని వాస్తవ పరిస్థితులపై జరిగిన సర్వేలోని అంశాల ఆధారంగా వ్యూహరచనపై కసరత్తు మొదలైంది. ప్రజల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై ఎలాంటి అభిప్రాయాలున్నాయి, మరీ ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల ఒపీనియన్​ ఏంటి, డివిజన్లలో కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్న నాయకులు, విజయావకాశాలు ఎవరికున్నాయి, లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సేవలు చేసిందెవరు, గత ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేంటి, అందులో అమలుకు నోచుకోనివి ఎన్ని అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రచార కార్యక్రమానికి పదునుపెట్టే పని జరుగుతోంది. ప్రజలు ఎలాంటివారిని కోరుకుంటున్నారు, ఎవరిని బరిలో దింపాలి అనే విషయాలపై రేవంత్ దృష్టి పెట్టారు.

అన్ని పార్టీల దృష్టి గ్రేటర్​పైనే..

గ్రేటర్ పరిధిలో మంత్రులు దూకుడు పెంచారు. అభివృద్ధి పనుల పేరుతో సందడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు రోజువారీగా సమీక్షలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అలర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇప్పటికే ఒకమారు సమావేశమై గ్రేటర్ ఎన్నికలపై చర్చించింది. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు సన్నద్ధం కావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెల 25లోగా కాంగ్రెస్, అనుబంధ సంఘాల డివిజన్ కమిటీలు భర్తీ చేయాలని ఆదేశించారు. పార్టీలో ఎవరి సంగతి ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రణాళిక ఖరారు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ సైతం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వంపై మాటల దాడిని పెంచుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ సంయుక్త ఆపరేషన్?

గ్రేటర్‌ అంశంలో రేవంత్‌రెడ్డిని ఒంటరి చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి పరిధిలోని డివిజన్లపై టీఆర్ఎస్‌కు ప్రత్యేక దృష్టి ఉంది. ఈ డివిజన్లలో గెలుపు బాధ్యత ఎంపీగా రేవంత్‌కు సంబంధించిన అంశం కావడంతో విజయావకాశాలు ఉన్న నేతల ఎంపిక కీలకంగా మారుతుంది. ఎన్ని సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్‌ రేవంత్‌కు పోతుందనేది నిర్వివాదాంశం. రేవంత్ బ్రాండ్ అభ్యర్థులను ఓడించడం ద్వారా ఆయన ప్రతిష్ఠను దిగజార్చవచ్చునన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. ఆ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన తర్వాత ప్రలోభాలతో పోటీ నుంచి తప్పించడం లేదా రెబల్ అభ్యర్థులను పరోక్షంగా ప్రోత్సహించడం ఆ వ్యూహంలో భాగం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రెబెల్‌గా బరిలో నిలబెట్టి రేవంత్‌ను బలహీనం చేయాలన్నది గులాబీ శ్రేణుల వ్యూహం.

Advertisement

Next Story

Most Viewed