పోలీసు రాజ్యంగా ‘సిరిసిల్ల’ : బండి సంజయ్

by Sridhar Babu |   ( Updated:2021-09-24 11:40:40.0  )
పోలీసు రాజ్యంగా ‘సిరిసిల్ల’ : బండి సంజయ్
X

దిశ, సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లాలో పోలీసు రాజ్యం కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కొనసాగుతున్న పాదయాత్ర శుక్రవారం సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, రైస్ మాఫియా, గల్ఫ్ మాఫియా, ఇతరత్రా అనేక అక్రమాలకు సిరిసిల్ల జిల్లా కేంద్ర బిందువుగా మారిందని, ముఖ్యమంత్రి తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇన్ని మాఫియాలు కొనసాగుతుంటే, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడుతామనే భయంతోనే సిరిసిల్ల జిల్లాలో సంగ్రామ యాత్ర సభలను పోలీసులతో అడ్డగిస్తున్నారని దుయ్యబట్టారు. తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీ అని, నేడు ఆ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడుతుండటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని, దీంతో రైతులు గందరగోళంలో పడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మతతత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం బీజేపీకి ఏ మాత్రం లేదని స్పష్టంచేశారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని, రెండేళ్ల తరువాత ఊదితే ఊడిపోయే పార్టీ టీఆర్ఎస్ అని సెటైర్లు వేశారు. తదుపరి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునే సమస్యే లేదన్నారు. పెట్రోలు ధరలు పెరిగినందుకే ఛార్జీలు పెంచుతామని కేసీఆర్ చెబుతున్నాడని కానీ, ఒక్క లీటర్‌కు రూ.40 చొప్పున కేసీఆర్ దోచుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. నెపం కేంద్రంపై మోపి పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. నిజంగా పేదలు, ఆర్టీసీపై ప్రేమ ఉంటే ఛార్జీలు ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు బయటకు వచ్చి ఉద్యమించకుంటే వారి బతుకులను కేసీఆర్ మరింత దుర్భరం చేయడం ఖాయమన్నారు. 27 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోతే బయటకు రాని వ్యక్తి కేసీఆర్ అని, ఆర్టీసీ ఆస్తులను అమ్మేసే కుట్ర జరుగుతోందన్నారు. కార్మికులంతా సంఘటితమై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచితే అడుగడుగునా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. ఈ సందర్బంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Next Story