స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటిది జరిగితే ఎలా తట్టుకోగలను.. ఆ వీడియోపై రష్మిక

by Anjali |   ( Updated:2023-11-06 13:22:43.0  )
స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలాంటిది జరిగితే ఎలా తట్టుకోగలను.. ఆ వీడియోపై రష్మిక
X

దిశ, సినిమా: పెరుగుతున్న టెక్నాల‌జీని మంచి కోసం వాడితే మంచి ఫ‌లితాన్నిస్తే.. చెడు కోసం వాడితే దుష్పరిణామాలు ఎదురవుతాయని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈ మధ్య ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాల‌జీ రావడంతో.. ఏ గెటప్‌లో ఏ సెలబ్రిటీ ఎలా ఉంటారో కూడా ఏఐ ఇమాజిన్డ్ ఫొటోస్ అంటూ వైరల్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా ఫేస్, బాడీ మార్ఫింగ్ పిక్స్‌తో భయపెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా మార్ఫింగ్ వీడియో ఒకటి బయటపడింది. చాలా వల్గర్‌గా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీంతో ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. దీన్ని సర్క్యులేట్ చేయకూడదని వేడుకునేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది.

అయితే తాజాగా ఈ వీడియోపై స్పందిస్తూ రష్మిక ట్వీట్ చేసింది. ‘ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌‌లో వైరల్ అవుతున్న ఈ డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి చూస్తుంటే నాకే కాదు.. టెక్నాలజీ దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా.

నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను హీరోయిన్ కాకుండా స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. దీన్ని ఎలా తట్టుకోగలనో నా ఊహకు అందడం లేదు. ఈ మార్ఫింగ్ బారిన పడి ఎక్కువ మంది బలికాకముందే ఈ సమస్యను పరిష్కరించాలి’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోను అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed