మదర్ ఎఫెక్షన్.. డిపెండ్స్ ఆన్ డిప్రెషన్?

by Anukaran |   ( Updated:2021-06-03 20:55:52.0  )
మదర్ ఎఫెక్షన్.. డిపెండ్స్ ఆన్ డిప్రెషన్?
X

దిశ, ఫీచర్స్: స్వచ్ఛమైన మమకారానికి, మచ్చలేని వాత్సల్యానికి అచ్చమైన రూపం తల్లి ప్రేమ. మనుషుల్లోనే కాదు సృష్టిలో ఏ జీవి అయినా సరే తన పిల్లల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తుంది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలకు ఆపదొస్తే అల్లాడిపోతుంది. కన్న బిడ్డల ఆనందం కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటుంది. ఎన్ని బాధలైనా దిగమింగుతుంది. అలాంటిది తల్లీ బిడ్డల ప్రేమ బంధంలోనూ హెచ్చు తగ్గులుంటాయా? మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో డిప్రెషన్‌కు గురైతే బిడ్డకు ప్రేమను పంచే విషయంలో తేడాలుంటాయా? గతంలో ఎదుర్కొన్న ఒత్తిడి ఈ విషయంలో ప్రభావం చూపుతుందా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?

పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారితో ఆరోగ్యకర అనుబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒత్తిడికి గురవకుండా ఉంటేనే సాధ్యం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్(ఎన్‌ఐహెచ్‌ఆర్), మాడ్‌స్లే బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్(బీఆర్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో మహిళలు గర్భంతో ఉన్నప్పుడు డిప్రెషన్ అనుభవిస్తే లేదా గతంలో అలాంటి హిస్టరీ ఉంటే తల్లీబిడ్డల మధ్యన బాండింగ్‌ తగ్గిపోయే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అంశాలన్నీ తాజాగా ‘BJPsych ఓపెన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్టడీలో భాగంగా ప్రెగ్నెన్సీకి ముందు లేదా ప్రెగ్నెన్సీ టైమ్‌‌.. ఈ రెండింటిలో మదర్-చైల్డ్ రిలేషన్‌లో తేడాలకు ఏ టైమ్‌లో అనుభవించిన ఒత్తిడి కారణం అవుతుందనేది పరిశోధకులు పరిశీలించారు. ఈ క్రమంలో బిడ్డ పుట్టిన ఎనిమిది వారాలు, పన్నెండు నెలలు గల మహిళలను ‘ఆరోగ్యవంతమైన మహిళలు, ప్రెగ్నెన్సీ టైమ్‌లో డిప్రెషన్ ఎదుర్కొన్న మహిళలు, జీవితకాలం డిప్రెషన్ ఎదుర్కొని గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న మహిళలు’ అనే మూడు గ్రూపులుగా విభజించి ఈ అధ్యయనం చేశారు. ఈ మేరకు తల్లీబిడ్డల మధ్య అనుబంధాన్ని పరిగణలోకి తీసుకుని స్టడీ చేశారు.

ప్రస్తుతం, గతంలో డిప్రెషన్‌ హిస్టరీ లేని 51 మంది ఆరోగ్యవంతులైన తల్లులు, డిప్రెషన్ అనుభవిస్తూ సౌత్ లండన్ అండ్ మాడ్‌స్లే ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ పెరినాటల్ సైకియాట్రీ సర్వీసెస్‌కు రిఫర్ చేయబడిన 52 మంది, గతంలో ఒత్తిడిని ఎదుర్కొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న 28 మంది.. ఇలా మొత్తంగా 131 మంది తల్లులు ఈ స్టడీలో పాల్గొన్నారు. కాగా రీసెర్చర్స్.. ప్రసవానంతరం ఆరు వారాలు, 12 నెలల తల్లి-శిశువు మధ్య మూడు నిమిషాల ఇంటరాక్షన్స్ వీడియోల ఆధారంగా అనుబంధాన్ని విశ్లేషించారు. ఈ అమ్మలు తమ పిల్లలను లాలిస్తున్న క్రమంలో ‘ఫేషియల్ అండ్ వోకల్ ఎక్స్‌ప్రెషన్, పొజిషన్, బాడీ కాంటాక్ట్, వాత్సల్యం, ప్రేరణ, నియంత్రణ, చాయిస్ ఆఫ్ యాక్టివిటీ’ వంటి ప్రవర్తనకు సంబంధించిన అంశాల ఆధారంగా తల్లీబిడ్డల మధ్య ప్రేమను అంచనా వేశారు.

ఇంటరాక్షన్ లక్షణాలు..

డిప్రెషన్‌కు లోనైన లేదా గతంలో ఒత్తిడి అనుభవించిన గ్రూప్స్‌కు సంబంధించి ఎనిమిది వారాలు, పన్నెండు నెలల శిశువులు గల తల్లులకు మధ్య ఇంటరాక్షన్‌ కొంతమేర తగ్గినట్టు తేలింది. ప్రత్యేకించి ఎనిమిది వారాలు గల పిల్లల విషయంలో ప్రెగ్నెన్సీ టైమ్‌లో డిప్రెషన్ ఎదుర్కొన్న మహిళా గ్రూప్‌లో 62 శాతం, పాస్ట్ హిస్టరీ కలిగి ఉన్న గ్రూప్‌లో 56 శాతం తల్లులకు పిల్లలతో అత్యంత తక్కువ స్థాయి ఇంటరాక్షన్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఇక ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో 32 శాతం ప్రభావం కనిపించింది. అయితే 8 వారాల నుంచి 12 నెలలకు వచ్చేసరికి వారి మధ్య ఇంటరాక్షన్ లెవెల్ పెరిగిందని రీసెర్చర్స్ వెల్లడించారు. కాగా ఆరు రోజుల వయసున్న శిశువులు ఉన్న మొదటి రెండు గ్రూప్స్‌కు చెందిన తల్లుల్లో ప్రసూతి, సామాజిక ఆర్థిక కష్టాల కారణంగా సోషల్ ఇంటరాక్టివ్ బిహేవియర్ తగ్గిందని, అది పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గేందుకు కారణమై ఉండవచ్చని అంచనా వేశారు.

భవిష్యత్ పరిశోధనలు అవసరం..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో డిప్రెషన్‌తో ఉన్న మహిళలకే కాకుండా గతంలో ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రెగ్నెంట్ ఉమెన్‌కు కూడా పెరినాటల్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ సపోర్ట్ అవసరమనే విషయాన్ని ఈ అధ్యయనం తెలిపింది. ప్రసవానికి ముందు మహిళలు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ప్రసవానంతరం ఎందుకని గత నేపథ్యాలు తల్లీబిడ్డల మధ్య ఇంటరాక్షన్‌ను ప్రభావం చేస్తున్నాయో భవిష్యత్ పరిశోధనల ద్వారా తెలుసుకోవాల్సి ఉంది. – డాక్టర్ రెబెకా బైండ్, రీసెర్చ్ అసోసియేట్, కింగ్స్ కాలేజ్ లండన్

ప్రారంభ సంవత్సరాలే కీలకం..

ఇంటరాక్షన్ సమస్యలు ఎదుర్కొంటున్న తల్లులకు.. సానుకూల సంరక్షణ ప్రవర్తనలు, పిల్లలు తమను అంటిపెట్టుకుని ఉండే పద్ధతులు, వారి అవసరాలను అర్థం చేసుకునే విధానాలను తెలియజేయాలని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు సూచిస్తున్నాం. ఇందులో పేరెంటింగ్, బర్త్ క్లాసులతో పాటు హెల్త్ విజిట్స్ కూడా చేర్చాలి. తల్లి-శిశువు మధ్య రిలేషన్ బలపడేందుకు సాయపడే వీడియో ఫీడ్‌బ్యాక్ వంటివి మరింత విస్తృతంగా అందుబాటులో ఉంచాలని కూడా సూచిస్తున్నాం. శిశువుకు తల్లిపై అటెన్షన్ క్రియేట్ చేయడంతో పాటు ఏడ్చినపుడు ఓదార్చడంలో ఎటువంటి యాక్టివిటీస్ ఉత్తమంగా పనిచేస్తాయో డాక్టర్స్ తల్లులతో చర్చించాలి. ఎందుకంటే భవిష్యత్ మానసిక ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ప్రారంభ సంవత్సరాలే కీలకం. – కార్మిన్ పేరియంట్, ప్రొఫెసర్, బయోలాజికల్ సైకియాట్రీ, కింగ్స్ కాలేజ్ లండన్

Advertisement

Next Story

Most Viewed