ఆస్పత్రిలో ఉరి వేసుకుని బాలింత మృతి.. వెలుగులోకి సంచలన నిజాలు

by Sridhar Babu |   ( Updated:2021-12-26 01:52:11.0  )
ఆస్పత్రిలో ఉరి వేసుకుని బాలింత మృతి.. వెలుగులోకి సంచలన నిజాలు
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఉమ (30) అనే బాలింత మృతి చెందింది. 20 సంవత్సరాల ఆస్పత్రి చరిత్రలోనే ఇది మాయని మచ్చగా నిలుస్తోంది. ఓ వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రంగంపల్లికి చెందిన ఉమకు కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి సంజీవ్ కు 2010లో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన 11సంవత్సరాలకు ఉమ గర్భం దాల్చడంతో మొదటి నుండి ప్రతి నెల పెద్దపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం చెకప్ లు చేయించుకున్నారు. ఇదే క్రమంలో డెలివరీ నిమిత్తం ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రికి రాగా 12వ తేదీన రాత్రి 9.30 గంటలకు సిజేరియన్ కావడంతో బాబుకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉండగా డెలివరీ అయిన 15 రోజుల తర్వాత ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి వార్డులోని బాత్ రూంలో చున్నీతో బాలింత ఉరి వేసుకొని మృతి చెందింది.

అయితే, ఆపరేషన్ చేసిన సమయంలో వేసిన కుట్లు ఇబ్బందిగా మారడంతో చీము వచ్చి సమస్య తలెత్తడంతో ఈ నెల 17వ తేదీన మరోసారి కుట్లు వేశారని అయిన కూడా మళ్లీ అలాగే జరగడంతో మరోసారి సోమవారం సర్జరీ చేస్తానని వైద్యులు తెలిపారని మృతురాలి భర్త సంజీవ్ పేర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యపు వైద్యం చేయడం వల్లే తన భార్య నొప్పులు భరించలేక ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలోని బాత్ రూంలో ఉరి వేసుకొని మృతి చెందిందని ఆరోపించారు. ఈ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే వైద్యులను సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, ఆపరేషన్ చేసే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుట్లు సరిగ్గా వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. డెలివరీకి వచ్చిన సమయంలో కొంతమంది ఆస్పత్రి సిబ్బందికి నొప్పులు వచ్చిన విషయం చెప్పినా పట్టించుకోలేదని.. అంతే కాకుండా ఏదైనా అడిగితే మాకు తెలుసా.. మీకు తెలుసా అంటూ కొంత మంది సిబ్బంది బెదిరించారని విమర్శించారు. తన భార్య ఉమకు సరైన వైద్యం అందించడంలో వైద్యులు విఫలమయ్యారని ఆరోపించారు.

ఇరు కుటుంబాల్లో విషాదం..

బాబు పుట్టాడన్న సంతోషం వారి కుటుంబాల్లో ఎంతోకాలం నిలవలేదు. ప్రతీ రోజు పుట్టిన బాబును చూసుకుంటూ మురిసిపోయిన వారి కుటుంబంలో తొందరపాటు నిర్ణయమే విషాద ఘటనకు దారి తీసింది. ఆపరేషన్ చేసిన సమయంలో నొప్పులు ఎక్కువగా ఉండడం, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కలత చెందిన గుమ్మాడి ఉమ ఆత్మహత్య చేసుకోవడం వారిలో ఆవేదనను మిగిల్చింది. సాధారణంగా ఆపరేషన్ నిర్వహించిన సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వాటిని ఎదుర్కొని పరిష్కారం దిశగా ఆలోచించకపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొందని పలువురు భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

గోదావరిఖని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రోజుకు వేల సంఖ్యలో చికిత్స నిమిత్తం రోగులు వస్తుంటారు. ప్రతినెల సుమారు 200 నుండి 300 వరకు డెలివరీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సుమారుగా ప్రతీ రోజు పదికిపైగా డెలివరీ ఆపరేషన్లను వైద్యులు నిర్వహిస్తారు. అయితే ఇలా నిర్వహించే క్రమంలోనే ఎక్కువ సంఖ్యలో ఆపరేషన్‌లు చేసే సమయంలోనే ఇష్టానుసారంగా బాలింతలకు కుట్లు వేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిజేరియన్ జరిగిన సమయంలో బాలింతలకు కనీసం తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించకపోవడంలో కొంత అలసత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్జరీల భయమే ప్రాణం తీసిందా..?

ఈనెల 11వ తేదీన డెలివరీ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఉమకు 12వ తేదీన రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ చేసిన సమయంలో వేసిన కుట్లు మానకుండా చీము రావడంతో మరోసారి 17వ తేదీన వైద్యులు కుట్లు వేశారు. అయితే రెండోసారి కుట్లు వేసిన సమయంలో కొంత మంది సిబ్బంది ఆపరేషన్ థియేటర్‌లో కుట్లు వేయకుండా లేబర్ రూమ్‌లో వేశారని మృతురాలి భర్త సంజీవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రెండోసారి వేసిన కుట్లకు సైతం చీము రావడంతో సోమవారం మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. ఈ భయంతోనే బాలింత ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed