- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గేమ్ ఓవర్ V/s గేమ్ ఆన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల క్యాంపెయిన్ హోరాహోరీగా సాగుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం మమతా బెనర్జీ శనివారం రాష్ట్రంలో 60 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన వేర్వేరు ర్యాలీల్లో మాట్లాడారు. పరస్పరం ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకున్నారు. ఎన్నికలను ఉద్దేశిస్తూ ఇప్పుడే ఆట మొదలైందని(గేమ్ ఆన్) బెనర్జీ బీజేపీని హెచ్చరించారు. కాగా, ప్రధానమంత్రి కూడా గేమ్ ఓవర్ అంటూ ప్రతివిమర్శ చేశారు. అంపైర్లను తరుచూ ప్లేయర్లు విమర్శిస్తుంటే ఆట ముగిసినట్టే(గేమ్ ఓవర్)నని అన్నారు. ఎన్నికల సంఘంపై తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను పరోక్షంగా పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో దీదీ మాట్లాడగా, హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ప్రధాని ప్రసంగించారు.
వారణాసికి వస్తే తట్టుకుంటారా?: పీఎం
మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో పరాజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకున్నారని, అందుకే తర్వాతి ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయడానికి ప్రణాళికలూ వేసుకున్నారని ప్రధానమంత్రి మోడీ ఆరోపించారు. కానీ, వారణాసిలో నుదుటిపై తిలకం పెట్టుకున్నవారి కనిపిస్తారని, వారు జై శ్రీరామ్ అని పలుకుతుంటే దీదీ తట్టుకుంటారా? అని అడిగారు. వారణాసిలో ప్రతిరెండు నిమిషాలకోసారి హరహర మహాదేవ్ అంటారనీ పేర్కొన్నారు. వారణాసి ప్రజలు విశాల హృదయులని, బెనర్జీని తమతోనే ఉంచుకుంటారని, ఢిల్లీకి పంపబోరని చురకలంటించారు. బెంగాలీలంత విశాల హృదయులని అన్నారు.
మైనార్టీలూ.. ఎంఐఎం, ఐఎస్ఎఫ్‌లను నమ్మొద్దు: సీఎం
ఎన్నికల కోసం బీజేపీ మతోన్మాద ఘర్షణలకు కుట్రలు చేస్తున్నదని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్‌ను విభజించాలని బీజేపీ భావిస్తున్నదని, బెంగాల్ సంస్కృతి, భాషలను అంతమొందించాలని కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. బీజేపీ సోపతి పార్టీ ఎంఐఎం, బెంగాల్‌లో దాని మద్దతుదారు ఐఎస్ఎఫ్‌ను మైనార్టీలు విశ్వసించవద్దని అన్నారు. ఈ రెండు పార్టీలు ఓట్ల చీలికకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తద్వారా ప్రత్యర్థి గెలుపునకు దోహదపడుతున్నాయని, కాబట్టి మైనార్టీలూ తమ ఓట్లు చీలిపోకుండా వ్యవహరించాలని సూచించారు. ఈ రెండు పార్టీలూ టీఎంసీ ఆరోపణలను ఇప్పటికే ఖండించాయి. సీపీఎం, కాంగ్రెస్‌తో కలిసి ఐఎస్ఎఫ్ ఎన్నికల్లో పోటీ చేస్తు్న్నది. అలాగే, హిందువులనూ బీజేపీ ఉచ్చులో పడవద్దని పిలుపునిచ్చారు. తానూ హిందువేనని, రోజూ చండీమంత్రం పఠించనిదే ఇంటి గడప దాటరని వివరించారు. బీజేపీ వ్యూహంలో చిక్కి ఉద్వేగాలకు లోనుకావొద్దని అన్నారు.
సెక్యులరిజం ఆటలతో దేశం నష్టపోయింది: అసోంలో మోడీ
అన్ని వర్గాల అభివృద్ధికి ఎన్‌డీఏ నిష్పక్షపాతంగా విధానాలను అమలు చేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోంలో అన్నారు. అసోం అకార్డ్‌లోని చాలా అంశాలను అమలు చేశామని, మిగిలిన సమస్యలనూ త్వరలోనే పరిష్కరిస్తామని వివరించారు. సెక్యులరిజం, కమ్యునలిజంతో దేశం చాలా నష్టపోయిందని అన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తే మతోన్మాదమంటూ ఆరోపణలు చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్‌డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అసోం ప్రజలు రెండింతలు లబ్ది పొందారని అన్నారు.
హిమంతపై 24 గంటల బ్యాన్
ప్రతిపక్ష నేత, బీపీఎఫ్ చీఫ్ హంగ్రామా మొహిలరీని జైలుకు పంపుతానని బెదిరించిన బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మపై ఎన్నికల సంఘం 24 గంటలపటు ప్రచారాన్ని నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. తొలుత 48 గంటల బ్యాన్ విధించినప్పటికీ తర్వాత దీన్ని సగానికి తగ్గించింది. ఫలితంగా అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు పాల్గొనబోతున్నారు.