బీజేపీలోకి వెళ్తానన్న టీఆర్ఎస్ నేత.. భలే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్

by Shyam |   ( Updated:2021-03-29 06:37:46.0  )
బీజేపీలోకి వెళ్తానన్న టీఆర్ఎస్ నేత.. భలే ఆఫర్ ఇచ్చిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీ హామీ లభించింది. ఆశించిన టికెట్ రాకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడంతో చల్లబడ్డారు. టికెట్ రాకపోతే బీజేపీ తరఫున నాగార్జునసాగర్‌కు పోటీ చేయనున్నట్లు వార్తలు రావడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్ రెడ్డి ఆయనను ప్రగతి భవన్‌కు తీసుకెళ్ళి కేసీఆర్‌తో మాట్లాడించారు.

జగదీశ్ రెడ్డికి సన్నిహితులైన కోటిరెడ్డి చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూశారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో కనీసం సాగర్ ఉప ఎన్నికల్లోనైనా అవకాశం లభిస్తుందని ఎదురుచూశారు. అది కూడా అందని ద్రాక్షగా మారడంతో తన దారి తాను చూసుకోవాలని భావించారు. చివరకు బీజేపీ వైపు వెళ్ళిపోకుండా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు స్వయంగా కేసీఆర్ హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు.

ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎమ్మెల్యే కోటాలో 2019లో కౌన్సిల్‌లోకి అడుగు పెట్టిన గుత్తా పదవీకాలం పూర్తయిన తర్వాత ఆ స్థానంలో కోటిరెడ్డికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి విముఖంగా ఉండడంతో కేసీఆర్ హామీతో కోటిరెడ్డికి ఆశలు చిగురించాయి.

Advertisement

Next Story

Most Viewed