- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఓట్లపైనే అభ్యర్థుల గంపెడాశలు..
కొన్ని గంటల్లో ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. తమ ప్రణాళికలు ఫలించేనో లేదోనని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ప్రయోగించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కుల ఓట్లపై పెద్ద హోప్పెట్టుకున్నారు. ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే కుల సమీకరణాలు చేపట్టారు. గ్రామాల్లో కులపెద్దలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. తమ గెలుపు బాధ్యతలను కులపెద్దల భుజస్కంధాలపై మోపారు. పార్టీలతో సంబంధం లేకుండా తమ కులం అభ్యర్థిని గెలిపించుకుంటామని ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించుకున్నారు. ప్రతిఫలంగా కుల సంఘాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి హామీలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కుల ఓట్లు కలిసివొచ్చేనో లేదోననే టెన్షన్అభ్యర్థుల్లో నెలకొంది.
దిశప్రతినిధి , హైదరాబాద్ : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులం గెలుపునిస్తుందా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఐదుగురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి వాణీదేవి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి మరో మాజీ మంత్రి ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేశారు. అయితే ఎన్నికలకు ముందు అందరూ ప్రధాన పార్టీల అభ్యర్థులు కులాల ప్రాతిపదికన నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలకతీతంగా కులం అభ్యర్థులకు ఓట్లు వేయాలనే తీర్మానాలు కూడా చేశారు. ఈనెల 14వ తేదీన జరిగిన పోలింగ్ లో ముందుగా తీర్మానాలు చేసిన ప్రకారం పార్టీలతో ప్రమేయం లేకుండా కులాల ప్రాతిపదికన గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారా అనేది అభ్యర్థులు సమీకరణాలు చేస్తున్నారు.
కులం ఓట్లు గట్టెక్కిస్థాయా…?
గతంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ గుర్తులే విజయానికి దోహదపడతాయని అందరూ భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేవలం పార్టీ ఓట్లు కాకుండా కులాల ఓట్లు కూడా కీలకంగా మారాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది మరోసారి కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ గుర్తు మాత్రమే కాకుండా కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో అభ్యర్థులు కూడా పాల్గొని తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తన గెలుపునకు సహకరిస్తే కులం అభివృద్ధికి సహకరిస్తానని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలాంటి సమావేశాలు కేవలం హైదరాబాద్ లోనే కాకుండా మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా కులం అభ్యర్థులకే ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ తతంగం ఎన్నికల్లో ఎంత వరకు ఆచరించారో అభ్యర్థులు తేల్చుకోలేకపోతున్నారు. కౌంటింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడం, పార్టీ గుర్తు తో పాటు కులాల ఓట్లు తమను గట్టెక్కి ఇస్తాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు.