నాకే వ్యతిరేకంగా రాస్తారా.. అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టండి

by Sridhar Babu |   ( Updated:2020-08-12 08:11:05.0  )
నాకే వ్యతిరేకంగా రాస్తారా.. అలాంటి జర్నలిస్టులపై కేసులు పెట్టండి
X

దిశ‌ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: అక్రిడిటేష‌న్ లేని జ‌ర్న‌లిస్టులపై కేసులు న‌మోదు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య పోలీసుల‌కు సూచించారు. ఖ‌మ్మం జిల్లా త‌ల్లాడలో బుధ‌వారం రైతుల‌కు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తల్లాడ మండలం మిట్టపల్లి సొసైటీ ధాన్యం కొనుగోలు విషయంలో రాద్ధాంతం చేస్తున్నార‌ని అన్నారు. త‌ప్పులుంటే వార్త రాయాల‌ని, కానీ బ్లాక్‌మేయిల్ చేసే ఉద్దేశంతో వార్త‌లు రాయొద్ద‌ని హిత‌వు ప‌లికారు.

మిట్టపల్లిలో సొసైటీ ఆధ్వ‌ర్యంలో సేక‌రించిన ధాన్యం పాడైపోయింద‌ని, నాకు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తారా..? అంటూ మండిప‌డ్డారు. కొంత‌మంది జర్నలిస్టులు ఇటీవలి కాలంలో వార్తలు రాసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అక్రిడిటేషన్ లేకుండా వార్త‌లు రాసే వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని ఎమ్మెల్యే స్థానిక సీఐని ఆదేశించారు. ప్రతి విషయాన్ని మీడియా రాద్ధాంతం చేస్తూ, బురద జల్లుతోంద‌ని ఆరోపించారు.

Advertisement

Next Story