ఆ మంత్రులు కూడా గాంధీలో చేరాలి : ఎమ్మెల్యే రాజాసింగ్

by Shyam |
ఆ మంత్రులు కూడా గాంధీలో చేరాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, న్యూస్ బ్యూరో: ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, లక్షాధికారి అయినా కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి వెళ్లాల్సిందేనంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా అలాంటివారంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. హోం మంత్రి మహమూద్ అలీకి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా వచ్చిందని, కానీ వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరారని గుర్తు చేశారు. కేసీఆర్ చెప్పిన మాట ఆచరణలోకి రావాలంటే ఆయన తొలుత ఫామ్ హౌజ్ నుంచి బైటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను స్వయంగా సందర్శించి అక్కడ అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని హితవు పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అర్థమవుతుందన్నారు. పేదలకు మాత్రం కరోనా వస్తే గాంధీ ఆసుపత్రి మాత్రమే దిక్కవుతోందని, వీఐపీలకు మాత్రం యశోద, అపోలో ఆసుపత్రులు కనిపిస్తున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి చూడాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించాలని కోరారు. “తెలంగాణ ప్రజలను చంపకండి. పేదలు చనిపోతే బాడీ కూడా దొరకడంలేదు. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని దయనీయ పరిస్థితుల్ని తెలుసుకోండి. హోం మంత్రి మహమూద్ అలీ, మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆస్పత్రిలో ఎందుకు చేరుతున్నారో అడిగి చూడండి. ప్రభుత్వాసుపత్రులపై నేను చేస్తున్నవి ఆరోపణలు కాదు. వాస్తవిక పరిస్థితి” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed