కెరీర్‌కు ముగింపు పలికేది అప్పుడే : మిథాలీ

by Shyam |
కెరీర్‌కు ముగింపు పలికేది అప్పుడే : మిథాలీ
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల క్రికెట్‌లో లెజెండ్ ఎవరంటే ఠక్కున గుర్తుచ్చేది ఈ హైదరాబాదీ పేరే. మహిళా క్రికెట్‌కు అంతగా ఆదరణ లేని సమయంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సత్తాచాటి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తనని స్ఫూర్తిగా తీసుకునే ఇండియాలో చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌లోకి అడుగుపెట్టారంటే అతిశయోక్తి కాదు. తనే టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్. ‘పురుషుల క్రికెట్‌లో సచిన్ ఎలాగో.. మహిళా క్రికెట్‌కు మిథాలీ అలా.’ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు ఛేదించడంతో పాటు మరెన్నో ట్రోఫీలు అందుకున్న మిథాలీకి ఒక్కటి మాత్రం ఇప్పటి వరకు అందని ద్రాక్ష లాగే మిగిలిపోయింది.. అదే ఐసీసీ ట్రోఫీ. 16 ఏళ్లకే క్రికెట్‌లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులను తన పేర లిఖించుకున్న సచిన్ కూడా వరల్డ్ కప్ అందుకునేందుకు .. పాతికేళ్లు నిరీక్షించాడు. అలాగే తాను కూడా వరల్డ్ కప్ అందుకున్నాకే కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని మిథాలీ చెబుతోంది.

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మిథాలీతో కలిసి కామెంటేటర్ లిసా షలేకర్‌, జులన్ గోస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చాట్ చేశారు. ఈ సందర్భంగా మిథాలీ పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ‘ఐసీసీ ట్రోఫీ అందుకోవాలనే తపనే తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తోందని.. 2021 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో తన బెస్ట్ ఇస్తానని’ చెప్పింది. గతంలో నాలుగైదు వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం తప్పక పనికొస్తుందని మిథాలీ చెప్పింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత 2021లోనే క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఆమె వెల్లడించింది. కాగా, వన్డే ప్రపంచ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలో న్యూజిలాండ్‌లో జరగనుండగా.. కరోనా కారణంగా ఈ టోర్నీ నిలిచిపోయే అవకాశం లేదని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది. అయితే భారత మహిళా జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని సైతం గెలవకపోవడం గమనార్హం.

Tags : Mithali Raj, Jhulan Goswamy, Cricket, Women’s Team, Team India, ICC, World Cup, BCCI, Coronavirus, Live Chat

Advertisement

Next Story