ఎంబీ రికార్డులు కాల్చేశారా..?

by Shyam |
Missing MB records
X

దిశ, తెలంగాణ బ్యూరో: జల వనరుల శాఖలోని ఎస్సారెస్పీ విభాగంలో ఎంబీ రికార్డుల మిస్సింగ్లో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని తొక్కి పెట్టేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికీ కనిపించకుండా ఉన్న ఎంబీ రికార్డులను కాల్చి వేసినట్లుగా అనుమానిస్తున్నారు. కొంతకాలం కిందట చనిపోయిన ఇంజినీర్ ఇంటిలో కొన్ని ఎంబీలు దొరికినట్టుగా అధికారులు చెప్పుతున్నారు. సదరు ఇంజినీర్ ఇంట్లో ఎంబీలు ఎందుకు దాచి పెట్టారో, దీనికి ఎవరెవరు బాధ్యులో ఇంకా తేల్చడం లేదు. అసలు అక్కడ ఎన్ని ఎంబీలు చిక్కాయో కూడా ప్రకటించడం లేదు.

మిగతా ఎంబీలు ఏమయ్యాయి?

ఎస్సారెస్పీలో మొత్తం 136 ఎంబీలు కనిపించడం లేదని అధికారులు ఒప్పుకుంటున్నారు. దీనిపై పలువురు ఇంజినీర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే వీటిలో 74 ఎంబీ రికార్డులు దొరికినట్లుగా ఇటీవలే ప్రకటించారు. అంటే మిగతా ఎంబీలు ఏమయ్యాయనేది ఇంకా రహస్యమే. వాటి గురించి ఆరా తీయకపోవడంలో ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్​. ఇటీవల చనిపోయిన ఓ ఇంజనీరు నివాసానికి వెళ్లి సోదాలు చేసిన ఇరిగేషన్ అధికారులు ఈ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారో తేలడం లేదు. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఎంబీలు మిస్ అయి నెలలు గడుస్తున్నా క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయడం లేదనేది కూడా ప్రశ్నార్థకమే. గతంలోనే దీనిపై శాఖాపరమైన విచారణ చేసినా.. మధ్యలోనే ఆపేశారు. ఒకవేళ శాఖాపరంగా లోతుగా విచారణను ఎందుకు చేయడం లేదనేది అధికారులు దాస్తున్నారు.

మూవ్​మెంట్ రిజిస్టర్​ ఎక్కడ..?

ఎంబీ రికార్డులే కాకుండా మూవ్​మెంట్ రిజిస్టర్ కూడా మాయం అయిందని తెలుస్తోంది. ఒక శాఖలో చేసిన పనులకు సంబంధించిన అంశంలో మూవ్​మెంట్ రిజిస్టర్ అదృశ్యం కావడం అంటే సాధారణ విషయం కాదని ఉన్నతాధికారులే చెప్పుతున్నారు. ఇందులో కేవలం ఈ ఎంబీలకు సంబంధించిన వివరాలే కాకుండా ఇతర పనులకు సంబంధించిన ఎంబీల గురించి కూడా నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి మూవ్​మెంట్ రిజిస్టర్ కూడా మాయం చేశారంటే వేరే పనులకు సంబంధించిన మేజర్మెంట్స్ బుక్స్ కూడా మాయం చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ.. శాఖాపరంగా విచారణ జరిపడంలోనూ తాత్సారం చేస్తున్నారు. అయితే ఈ ఎంబీల గల్లంతుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగుల వేతనాలు నిలిపివేసిన అధికారులు.. మళ్లీ ఉన్నట్టుండి వారి జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ లెక్కన కచ్చితంగా ఎంబీల గల్లంతు విషయాన్ని మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాల్చే ఉంటారంటున్న ఇంజినీర్లు

ఎస్సారెస్పీ సర్కిల్లో జరిగిన మెజెర్మెంట్ పుస్తకాల గల్లంతులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వీటిని కాల్చి వేశారని ఇంజినీర్లు చెప్పుతున్నారు. వాస్తవంగా ప్రధాన కాల్వ, ఉపకాల్వల మరమ్మతులు, సిబ్బంది క్వార్టర్ల మరమ్మతు పనులు చేశారని, వందల కోట్ల పనులను చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. వీటిలో కొన్ని నిర్ధారణ కూడా అయ్యాయని సమాచారం. మిగిలిన పనులకు సంబంధించిన అక్రమాలు కూడా బయటకు రాకుండా ఈ ఎంబీ రికార్డులను కాల్చి వేశారని తెలుస్తోంది.

Advertisement

Next Story