ఇంట్లో ఉండే.. ‘దేఖో అప్నా దేశ్’

by vinod kumar |
ఇంట్లో ఉండే.. ‘దేఖో అప్నా దేశ్’
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఎవరూ కూడా ఇల్లు కదలలేని పరిస్థితి. అసలే ఇది సమ్మర్ టైమ్. వేసవి సెలవుల్లో చాలా మంది టూర్లు ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ కరోనా అడుగుపెట్టి.. ప్లాన్ అంతా తలకిందులు చేసింది. అయినా ఇంట్లో ఉండే.. మన దేశ టూరిస్ట్ ప్లేస్ లను చూడాలని ఉందా. అయితే మన కోసమే పర్యాటక శాఖ ‘దేఖో అప్నా దేశ్’ పేరిట వెబినార్ సిరీస్ ను ప్రారంభించింది.

కరోనా వల్ల కాలు గడప దాటకపోయినా.. ప్రపంచాన్ని చుట్టి రావోచ్చు. అదెలా అంటారా? అదే వర్చువల్ రియాలటీ. హెడ్ సెట్ లాంటి పరికరాన్ని మన కళ్లకు పెట్టుకుంటే చాలు.. కాళ్లు కదపకుండా ప్రపంచంలోని వింతలన్నీ చూసేయచ్చు. తాజ్ మహల్ అందాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. గేట్ వే ఆఫ్ ఇండియా ముందుకు వెళ్లి రావచ్చు. అదే ఈ టెక్నాలజీ చేసే మాయ. మనిషి శారీరకంగా ఎక్కడికీ కదలకుండా, కావల్సిన ప్రాంతంలో విహరించిన అనుభూతిని వర్చువల్ రియాలిటీ పంచుతుంది. ప్రస్తుతం ప్రపంచ పర్యాటక ప్రదేశాలెన్నో ఈ టెక్నాలజీతో మనకు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా పర్యాటక శాఖ కూడా ఈ సరికొత్త టెక్నాలజీ సాయంతో ‘దేఖో అప్నా దేశ్ ’ పేరుతో వెబినార్ సిరీస్ ను ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలు, వారసత్వ సంపదను ప్రతిబింబించే కట్టడాలను వర్చువల్ రూపంలో వీక్షించవచ్చు.

తొలిగా దేశ రాజధాని అందాలు:

దేఖో అప్నా దేశ్ లో భాగంగా మంగళవారం ఢిల్లీ నగరంపై ‘సిటీ ఆఫ్ సిటీస్-ఢిల్లీస్ పర్సనల్ డైరీ’ పేరుతో రూపొందించిన తొలి వెబినార్ ను ప్రసారం చేసింది. గురువారం కోల్ కతా నగరం విశేషాలపై వెబినార్ సిరీస్ ఉంటుంది. ‘మన నాగరికత విశేషాలు, స్మారక కట్టడాలు, కళలు, నృత్యాలు, సుందరమైన ప్రదేశాలను ఈ సాంకేతిక సాయంతో ప్రజల ముందుకు తీసుకువచ్చాం. పర్యాటక శాఖ అధికారిక వెబ్ సైట్ లో ఈ వెబినార్ సిరీస్ ను వీక్షించవచ్చు’ అని పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు.

ప్రపంచ వింతలు:

మనం గూగుల్ లో సెర్చ్ చేసి ప్రపంచ వింతల్ని, పర్యాటక ప్రదేశాల్ని చూసే అవకాశం ఉంది. ఉదాహరణకు తాజ్ మహల్ వర్చువల్ టూర్ అని సెర్చ్ చేస్తే.. మనకు లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. తాజ్ ను చూడొచ్చు. అలానే ఈజిప్టులోని పిరమిడ్స్, ఇంగ్గండ్ లోని ‘స్టోన్ హెంజె’, అమెరికాలోని ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’, ఇటలీలోని ‘పిసా’ టవర్, పారిస్ లోని ‘ఈఫిల్ టవర్’ ఇలా ఎన్నో ప్రాంతాలను ఇంట్లో ఉండే చూసొయచ్చు.

tags: lockdown, india, tourist places, webinar. dekho apna desh, delhi, kolkata

Advertisement

Next Story