కేంద్రానికి అబద్దాలు చెబుతూ నిర్మాణాలు.. జగన్‌పై పువ్వాడ ఫైర్

by srinivas |
Puvvada-Ajay-Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాలను అక్రమంగా తరలించడంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీరు పరాకాష్టకు చేరుకుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు అంశంపై పోరాడారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అబద్ధాలు చెబుతూ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

బీజేపీ నేతలు ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆనాడు నీటి పంపకాల సమయంలో ప్రధానిగా ఉన్నది ఇందిరాగాంధీ అని సీఎం కేసీఆర్ లేడని చురకలంటించారు. ఆనాడే వైఎస్సార్ తెలంగాణలో ఒకలా.. ఏపీలో ఇంకోలా మాట్లాడి తెలంగాణ సమాజాన్ని చిన్నచూపు చూశారని, ఇప్పుడు అదే దారిలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తయారయ్యారని విమర్శలు చేశారు.

కేంద్రంలో అధికార బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతోందని, రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం కేసీఆర్ రాయలసీమకు నీళ్లు ఇస్తామనే మాటలను ఏపీ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. తెలంగాణలోని ఏడు మండలాల్లో అక్రమంగా పోలవరం కట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. తాము తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడుతున్నామని, హీరోయిజం కోసం కాదని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed