మేడ్చల్‌లో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

by Shyam |
మేడ్చల్‌లో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
X

– కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

దిశ, హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో రైతులు పండించిన పంటను విక్రయించేందుకు 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ఎఫ్ఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్నిశుక్రవారం కీసరలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ,నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) వ్యాప్తి చెందుతున్న ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందనీ, ఈ నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్నదాత పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు రూ.25 వేల కోట్లను, మక్కలు కొనుగోలు చేసేందుకు రూ.3200 కోట్లు కేటాయించినట్టు వివరించారు. అనంతరం పగిడి షీలా ఫంక్షన్ హాల్‌లో వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ.500 అందజేశారు. ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ పొడిగించిన కారణంగా వలస కార్మికులకు, పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు రూ.500 అందజేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,జిల్లాలో ఏమైనా లాక్ డౌన్ ఇబ్బందుల దృష్ట్యా ఆహార సమస్యలకు తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత, జిల్లా రైతు సమైక్య సమితి అధ్యక్షులు నందారెడ్డి, కీసర ఆర్డీవో రవి, డీఎం రాజేందర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ ఇంద్ర, సర్పంచ్ మాధురి, జెడ్పీటీసీ బెస్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grain Buying center, medchal district, Food and civil supply, Covid 19 affect, Farmers, mallareddy

Advertisement

Next Story