త్వరలోనే మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. కేటీఆర్ కీలక ప్రకటన

by Shyam |
త్వరలోనే మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. కేటీఆర్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలోనే మరో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ సనత్ నగర్‌లో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 1,350 ఆటోలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు. కేంద్రం స్వచ్ఛ సర్వేక్షన్ స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రకటిస్తున్న అవార్డుల్లో హైదరాబాద్ బెస్ట్ నగరంగా నిలుస్తుందని వెల్లడించారు. ఎక్కడికక్కడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. సఫాయి అన్నా.. నీకు సలాం అన్న ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని.. వారికి గౌరవప్రదమైన వేతనం అందజేస్తున్నారని వెల్లడించారు.

గతంలో హైదరాబాద్‌లో 35 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది అని, ప్రస్తుతం 65,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నదని వెల్లడించారు. ఆరేళ్లలో జీహెచ్ఎంసీకి 5,750 పైచిలుకు స్వచ్ఛ ఆటోలను అందజేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను జవహర్ నగర్‌లో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 28 మెగావాట్ల ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా లభించాయని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలంతా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేతకాని, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లక్ష్మి, మహేశ్వరి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story