నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నం

by Shyam |
నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నగర ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తామని హామీనిచ్చం. దాని ప్రకారం ఇప్పుడు నీళ్లిచ్చి మాట నిలబెట్టుకున్నం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో ఉచిత వాటర్ పంపిణీ పథకాన్ని మంగళవారం ఆయన రహమత్‌నగర్‌లో ప్రారంభించి మాట్లాడారు. 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో వాటర్ కష్టాలు చూశామని, గడిచిన ఐదారేళ్లుగా ఇబ్బందులు అధికమించి ప్రస్తుతం ఉచితంగా నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతున్నా ప్రజా సంక్షేమం కోసం తమ నిర్ణయాలు తీసుకోవడం ఆగడం లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ ఏర్పాటు చేసి సిటీలో నీటి కష్టాలు లేకుండా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.

మార్చి 31 లోపు మీటర్ తప్పనిసరి

ఉచిత తాగు నీటి పథకానికి అర్హులు కావాలనుకునేవారు మార్చి 31 లోపు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఫ్రీ వాటర్ ఇవ్వడం ద్వారా నెలకు రూ.19.92 కోట్ల ఆదాయాన్ని జలమండలి కోల్పోనుంది. అయితే 10 లక్షల నల్లా కనెక్షన్లకు ఈ పథకం ప్రయోజనం అందనున్నట్టు వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. 20 వేల లీట‌ర్ల నీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ పై వాడుకున్నవారు ఆ మేర‌కు నల్లా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతనెల డిసెంబర్ నుంచే వర్తించనుంది. మురికివాడల్లో, బస్తీలో ఉండేవారు వారి నల్లా కనెక్షన్లకు మీటర్లను బిగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయా వినియోగదారులకు జీరో బిల్ జారీ చేస్తారు. అయితే ఇప్పటివరకూ ఉచిత నీటి ఫథకాన్ని అమలు చేస్తున్న రెండో నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించింది.

Advertisement

Next Story