వరి సాగు చేస్తే ఉరి తప్పదు : మంత్రి జగదీష్ రెడ్డి

by Shyam |   ( Updated:2021-10-12 09:39:14.0  )
Jagadeesh Reddy
X

దిశ, నకిరేకల్: ప్రస్తుత పరిస్థితుల్లో వరిసాగు చేస్తే ఉరి తప్పదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని, ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేట్, ప్రభుత్వ గోడౌన్లు ధాన్యం నిల్వలతో నిండిపోయాయని తెలిపారు. మంగళవారం కట్టంగూరు మండలం అయిటిపాములలో గంగాదేవి గూడెంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు.

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కంది, వేరుశనగ, శనగ, ఆయిల్ ఫాం సాగు తదితర పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పారు. వ్యవసాయం చేసే ప్రతి రైతు పాడి అభివృద్ధి వైపు దృష్టి సారించాలని సూచించారు. గోమాతను పూజించడం అంటే భూమాతను రక్షించడం అని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో రైతులు ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ శాసనసభ్యుడు నంద్యాల నరసింహారెడ్డి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed