హరీష్ చేతికి ‘ఆపరేషన్​ హుజురాబాద్’​

by Anukaran |   ( Updated:2021-05-22 09:43:16.0  )
Eatala, Harish
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల వ్యవహారంలో వ్యూహాత్మక పరిణామాలు వేగమవుతున్నాయి. “ సీఎం కేసీఆర్​ నిర్ణయాలు, వ్యవహారణశీలితో ఇద్దరం తెల్లవారుజామున 3 గంటల వరకూ బాధపడ్డాం… నేనే హరీష్​రావును ఓదార్చాను” అంటూ చెప్పుకొచ్చిన ఈటల అనుమానాలు నిజమయ్యాయి. అనుకున్నట్టే హుజురాబాద్​ బాధ్యతలను హరీష్​రావుకు అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ గంగులను ఉసిగొల్పినా… ఆశించిన ప్రయోజనాలు రాకపోవడంతో ట్రబుల్​ షూటర్​ను రంగంలోకి దింపారు. అధినేత చెప్పిందే తడువుగా అటు హరీష్​రావు సైతం బరిలోకి దిగారు. ముందుగానే ఈటల సొంత మండలంపై కన్నేశారు. ఎట్టకేలకు అక్కడ ఈటల మద్దతుకు గండి కొట్టారు. సొంత మండలం ప్రజాప్రతినిధులు ఈటల రాజేందర్​కు ఎదురుతిరిగారు. దీంతో హుజురాబాద్​లో ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయోకానీ… ఇప్పటి నుంచి రాష్ట్రం చూపు మొత్తం హుజురాబాద్​కు మళ్లింది.

ముందు బలహీనం చేయడమే

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్​ కూడా విమర్శలకు పదును పెంచడంతో.. గులాబీ అధిష్టానం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. రాజేందర్​ సొంత నియోజకవర్గం హుజరాబాద్ కేంద్రంగా రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇక్కడ ఆయన్ను బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్​రావుతో ఆపరేషన్​ హుజురాబాద్​ మొదలుపెట్టింది. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలెవరూ ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేయడం ఆరంభమైంది. దీనిలో భాగంగా ఈటల వ్యవహారంలో తొలిసారిగా హరీష్​రావు ఎంట్రీ ఇచ్చారు. శనివారం హరీష్​రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్​కుమార్​తో కమలాపూర్ మండల నాయకుల భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కేడర్​ మొత్తం టీఆర్ఎస్​తో ఉన్నారంటూ కమలాపూర్​ నేతలు వ్యాఖ్యానించారు.

గంగులతో కాదు… అందుకే ట్రబుల్​ షూటర్​

మాజీ మంత్రి ఈటల రాజీనామా చేయడమా… పార్టీ నుంచి సస్పెండ్​ చేయడమా… ఏదైనా అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమనే భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ఈటలను ఓడించి, టీఆర్ఎస్​ సత్తా చాటాలని గులాబీ దళలం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌పై మంచి పట్టున్న ఈటల రాజేందర్‌ను కట్టడి చేసే బాధ్యలను ఇటీవల మంత్రి గంగులకు అప్పగించింది. అయితే గంగుల చేసిన ప్రయత్నాలు విఫలం అయినట్లు భావించిన గులాబీ దళపతి… చివరకు ట్రబుల్ షూటర్ హరీష్​ను బరిలోకి దింపారు.

వాస్తవానికి హరీష్​కు రాష్ట్రంలో ఒకింత పాపులారిటీ ఉంది. ఒక విధంగా సీఎం కేసీఆర్​ తర్వాత పాపులారిటీ ఉన్న నాయకుడు ఆయనే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సీఎం కేసీఆర్​ ఎప్పుడైనా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారని హరీష్​రావుపై నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా ఎన్నికలు ఏవైనా… హరీష్​రావును కొంతమేరకు వినియోగిస్తున్నారు కూడా. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా హరీష్​రావు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఓటిమిపై కేసీఆర్​ కొంత అసహనం వ్యక్తం చేసినా… అసలు అక్కడ టీఆర్ఎస్​ అభ్యర్థికి అంత మేరకు ఓట్లు రావడంలో కూడా హరీష్​రావుతోనే సాధ్యమైందనే అభిప్రాయాన్ని కేసీఆర్​ వెల్లడించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హరీష్​ హజూరాబాద్​పై ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మిత్రులమనడమే కొంప ముంచిందా..?

వాస్తవానికి ఈటల రాజేందర్​… హరీష్​రావు మధ్య ఉద్యమ సమయం నుంచి సాన్నిహిత్యమే ఉంది. ఈ స్నేహబంధమే టీఆర్ఎస్​కు ఈటలను దూరం చేశాయనే ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో ఇటీవల పలుమార్లు ఈటల కూడా హరీష్​రావుతో ఉన్న స్నేహాన్ని బట్టబయలు చేశారు. తనపై తన మిత్రుడు హరీష్​రావును హుజురాబాద్​లో రాజకీయం చేసేందుకు పంపిస్తున్నారని, ఎవరు వస్తారో చూస్తామంటూ ప్రకటించాడు. ఇది ఓ రకంగా టీఆర్​ఎస్​కు ఈటల సలహా ఇచ్చినట్టే మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాకుండా ఒక్కో మంత్రిపై కత్తి వేలాడుతుందని, ఇప్పటికే సీనియర్​ మంత్రులకు ప్రాధాన్యత లేదంటూ పేర్కొనడంలో హరీష్​రావును ఉద్దేశించి మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. అటు హరీష్​రావు కూడా ఈటల వ్యవహారంలో ఎక్కడా నోరెత్తలేదు. దీంతో గులాబీ బాస్​ కేసీఆర్​… దీనిపై తేల్చేందుకే హరీష్​కు ఆపరేషన్​ హుజురాబాద్​ అప్పగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్​ ఊహించినట్టే హరీష్​రావు వ్యూహాలన్నీ సక్సెస్​ అయి టీఆర్​ఎస్​కే విజయం దక్కితే దాన్ని పార్టీ… సీఎం కేసీఆర్​గుర్తింపుగా… ఒకవేళ ఆత్మ గౌరవం నినాదం పనిచేసి ఈటల రాజేందర్​ గెలిస్తే దాన్ని హరీష్​రావు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్లుగా చూపించేందుకు అవకాశంగా అధిష్టానానికి చిక్కనుంది. ఇలాంటి పరిణామాల్లో ఒక విధంగా ఆపరేషన్​ హుజురాబాద్​ మంత్రి హరీష్​రావుకు పెద్ద సవాలే.

అంతా అనుకుంటున్నట్టు స్నేహ బంధానికి ప్రాధాన్యత ఇస్తారా… లేకుంటే కేసీఆర్​ ఆదేశాల మేరకే కట్టుగా పార్టీ కోసం పని చేస్తారా… అనేది హుజురాబాద్​ రాజకీయ వ్యవహారంలో బయటకు తీయనున్నట్లు టీఆర్​ఎస్​లో టాక్​. ఇక ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత టీఆర్ఎస్​ కేడర్​ను కాపాడుకునే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలుపెట్టింది. ఈటలను ఒంటరి చేసేందుకు ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు స్థానిక నేతలు, మంత్రి గంగుల వరకే ఉన్న ప్లాన్​… ఇప్పుడు ట్రబుల్​ షూటర్​ హరీష్​ వరకూ వెళ్లింది. అందుకే ఈటలను ధీటుగా ఎదుర్కొన్నే వ్యూహమే ‘ఆపరేషన్​ హుజురాబాద్​’ అని, స్థానికంగా దెబ్బ కొట్టాలని, పార్టీ నుంచి నేతలు వెళ్లకుండా ఎలాగైనా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంగా రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు.

మరోవైపు అధిష్టానం ఆదేశమే తడువుగా… హరీష్​రావు కూడా రంగంలోకి దిగారు. అక్కడి నేతలతో సమావేశమవుతున్నారు. ఈటల రాజేందర్​ ఆరోపణలు చేసినట్టే… పెండింగ్​ బిల్లులు, గ్రామాల అభివృద్ధి పనులపై మాట్లాడుతున్నారు. కమలాపూర్​ నేతలకు కూడా పెండింగ్​ బిల్లులు మొత్తం వస్తాయంటూ హరీష్​రావు చెప్పినట్లు అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు మిత్రుల మధ్య సరికొత్త రాజకీయ ఫైట్​ హుజురాబాద్​ వేదికగా మొదలైంది.

Advertisement

Next Story