మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : హరీష్ రావు

by Shyam |
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : హరీష్ రావు
X

రాష్ర్ట ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేల జిల్లా కేంద్రంలోని మదీనా ఫంక్షన్ హాల్లో గురువారం ఖిద్మత్ బ్యాంక్ వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. కిద్మత్ బ్యాంక్ సామాన్యుల బ్యాంకు అని, వడ్డీ లేకుండా పేద వారికి రుణాలు అందిస్తూ సాయపడుతుందన్నారు. బ్యాంకు ఇచ్చే రుణాలతో పేద వారు చిరు వ్యాపారం చేసుకుంటూ లబ్ధి పొందవచ్చని, ఒక్కరోజు ఆనందం కోసం పార్టీలు,జల్సాలు చేస్తూ డబ్బు వృథా చేయకుండా పేద వారికి ఉపయోగపడే బ్యాంకులో డిపాజిట్ చేస్తే బాగుంటుందన్నారు. పేదవారికి సేవ కోసం పాటుపడాలని, బ్యాంక్ పేదలకు సేవలందిస్తోందన్నారు. ముస్లిం మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీల కంటే నిరుపేదలు చాలామంది ఉన్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చే పథకాల తరహాలోనే ముస్లింలకూ అందించడానికి ఎంతో కృషి చేశారన్నారు. ముస్లింల పిల్లలకు మెరుగైన విద్యాబోధన నుంచి ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 80శాతం సబ్సిడీపై రుణాలను అందిస్తున్నామన్నారు. నిరుపేదలకు సేవలు చేస్తే ఎంతో తృప్తి కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ మంచి ఆలోచనతో ముందుకు సాగినప్పుడే సమాజంలో గొప్ప మార్పు వస్తుందన్నారు. ఖిద్మత్ బ్యాంక్ సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయన్నారు. ఈ బ్యాంకుకు ప్రభుత్వపరంగా నిధులు వచ్చే విధంగా సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. డబ్బులను వృథా ఖర్చు చేయకుండా సేవ కార్యక్రమాలకు ఉపయోగించాలన్నారు. గతంలో మైక్రో బ్యాంకులు నిరుపేదలకు అప్పుగా డబ్బులను ఇచ్చి వారి రక్తాన్ని తాగారన్నారు. అదే ఖిద్మత్ బ్యాంక్ మిత్తి లేకుండా రుణాలు ఇస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed