సివిల్ ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే తలమానికం : మంత్రి గంగుల

by Shyam |
సివిల్ ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే తలమానికం : మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంత కృషి చేస్తోందని, రాష్ట్ర పౌర సరఫరాలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి నుంచే సిటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేని స్థితిలో ఉండగా, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాసుపత్రులు అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో అత్యాధునిక యంత్రాల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. గత కొన్నాళ్లుగా జిల్లాలో కొనసాగుతున్న ఆరోగ్య విపత్తుల నేపథ్యంలో, హైదరాబాదులోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు ధీటుగా జిల్లా కేంద్రంలో వైద్య సేవలు అందిస్తుండగా, ఇందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వసతులు, హంగులతో రోగులకు సమగ్ర సేవలందిస్తున్న జిల్లా ప్రధాన ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తుందన్నారు.

జిల్లా వైద్య రంగానికి గుర్తింపు తెచ్చిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో.. ప్రారంభించిన తేదీ నుంచి నేటి వరకు 35 వేల పైగా ప్రసవాలు జరుగగా, 21 వేల మందికి కేసీఆర్ కిట్‌లు అందించినట్లు చెప్పారు. కొవిడ్ మొదటి, రెండవ దశలో నిరంతర వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే పేరుగాంచగా, 79 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, వీరిలో 11 మంది మాత్రమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నట్లు, ఆర్థిక వనరుల సమస్య తొలగించేందుకు ఆస్పత్రి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు పెరుగుతున్నా, జిల్లాలో మాత్రం అలాంటి దాఖలాలు లేవని, ఒకవేళ వైరల్ ఫీవర్‌లు జిల్లా ప్రజలపై దాడి చేసినా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వైయస్సార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed