‘గన్నీ బ్యాగుల తయారీకి సీఎం గ్రీన్ సిగ్నల్’

by Ramesh Goud |   ( Updated:2020-04-13 07:36:12.0  )
‘గన్నీ బ్యాగుల తయారీకి సీఎం గ్రీన్ సిగ్నల్’
X

దిశ, వరంగల్: జిల్లాలో గ‌న్నీ బ్యాగుల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డానికి సీఎం కేసీఆర్ అంగీక‌రించార‌ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సోమవారం ఆయన విస్తృతంగా ప‌ర్య‌టించారు. పర్యటనలో భాగంగా ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లం మ‌ల‌క‌ప‌ల్లి, ఐన‌వోలు మండ‌లం సింగారం గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ యార్డు ఏనుమాముల‌లో వ‌డ్డీ ర‌హిత రుణాల‌కు సంబంధించిన చెక్కుల‌ను రైతుల‌కు అంద‌చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ పంట కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. కూలీల విషయంలోనూ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఉపాధి హామీ ప‌థ‌కం కేంద్రం ప‌రిధిలోనిది కావ‌డంతో ప్ర‌ధాని నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ధాన్యం నిల్వ చేసేందుకు సరిపడా గోదాంలు లేక‌పోవ‌డంతో రాష్ట్రంలోని ఫంక్ష‌న్ హాల్స్‌ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత తీర్చేందుకు సీఎం కేసీఆర్.. ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీతో మాట్లాడి బ్యాగులు తెప్పించార‌న్నారు. గన్నీ బ్యాగుల పరిశ్రమ బెంగాల్‌లోనే ఉందని, అయితే, మన రాష్ట్రంలోనూ అలాంటి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి కేటీఆర్ సంబంధిత పారిశ్రామిక‌వేత్త‌లతో మాట్లాడార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్ రావు, ఎనుమాముల మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ స‌దానందం, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, స్థానిక నేత‌లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags: warangal, minister Errabelli, dayakar rao, gunny bags, crop buy centres, dharmasagar, mla aroori ramesh

Advertisement

Next Story

Most Viewed