ఢిల్లీపై ఒత్తిడి పెంచుతాం.. కోచ్ ఫ్యాక్ట‌రీ తెస్తాం

by Shyam |
ఢిల్లీపై ఒత్తిడి పెంచుతాం.. కోచ్ ఫ్యాక్ట‌రీ తెస్తాం
X

దిశ‌, ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఆరు నూరైనా రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని సాధిస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్‌లో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ఎంపీలు బండా ప్ర‌కాశ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్సీలు క‌డియం శ్రీ‌హ‌రి, బ‌స్వ‌రాజు సార‌య్య‌, ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, కాజీపేట రైల్వే ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. అనంత‌రం 150.05 ఎకరాల భూమిని రైల్వే అధికారుల‌కు అప్ప‌గించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల ద‌శాబ్దాల కాలం నాటి ఆకాంక్ష రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ అన్నారు. పురాత‌న కాలంనాటి కాజీపేట జంక్ష‌న్‌కు అప్పుడెప్పుడో మంజూరైన కోచ్ ఫ్యాక్ట‌రీ.. అనుకోని ప‌రిస్థితుల్లో వేరే రాష్ట్రానికి త‌ర‌లిపోయింద‌న్నారు. అయితే, కోచ్ ఫ్యాక్ట‌రీకి బ‌దులు రైల్వే వాగ‌న్ ఓవ‌ర్ హోలింగ్ వ‌ర్క్ షాప్ ప్రాజెక్టు వ‌చ్చింద‌న్నారు. మొద‌ట్లో రైల్వే అధికారులు కోరిన విధంగా 60 ఎక‌రాల స్థ‌లానికి మించి 150.05 ఎక‌రాల భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వం, వివిధ వ‌ర్గాల నుంచి సేక‌రించి ఈ రోజు రైల్వే అధికారుల‌కు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప్ర‌జ‌లు, వివిధ పార్టీలు ద‌శాబ్దాలుగా రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని కోరార‌న్నారు. త‌ద్వారా ఇక్క‌డ యువ‌త‌కి ఉద్యోగావ‌కాశాలు ద‌క్కుతాయ‌ని భావించామ‌న్నారు. ఈ ద‌శ‌లోనూ రైల్వే అధికారులు అడిగిన దానికంటే ఎక్కువ స్థ‌లం కేటాయించినందున తిరిగి కాజీపేట‌కు రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీనే కేటాయించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్త‌ిడి తెస్తామ‌న్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో, ఉమ్మ‌డి జిల్లాకు చెందిన మొత్తం ప్రజాప్ర‌తినిధుల‌మంతా క‌లిసి, ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తామ‌ని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైన ఒత్త‌ిడి తెచ్చి, కాజీపేట‌కు రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని సాధించి తీరుతామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

Advertisement

Next Story

Most Viewed