జనగామ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి : మంత్రి ఎర్రబెల్లి

by Shyam |
Minister Errabelli Dayakar Rao
X

దిశ, జనగామ: అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో జిల్లా ప్రధాన ఆసుపత్రి, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో చేపడుతున్న సేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేదని అన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 84 పడకలకుగాను, 51 మంది రోగులు ఉండగా, 33 పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. రెండో విడత వ్యాక్సిన్‌కి ఫోన్‌లో సమాచారం ఇచ్చి చేపడుతున్న ట్లు ఆయన అన్నారు. పడకలు, ఆక్సిజన్, మందుల ఆడిటింగ్ కోసం కమిటీలు వేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు ఆక్సిజన్ బఫర్ స్టాక్ నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై ధరలు, పరీక్షలు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడే తీసుకొనేలా పర్యవేక్షణ చేయాలన్నారు.

ప్రజలు వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్‌లకు వెళ్లకుండా, అన్ని సౌకర్యాలు ఉన్న జనగామ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకొనేలా ఆస్పత్రిపై నమ్మకం కల్గించాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి అంతా మరో 10 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే లక్షా 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కష్ట కాలంలో సహకరించని రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మిల్లుల సీజింగ్‌కు సైతం వెనకాడవద్దన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందని, రైతులకు కావాల్సిన ఎరువులు ఇతరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. సమీక్షలో కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. పకడ్బందీ కోవిడ్ నియంత్రణతో జిల్లాలో తగ్గుముఖం పట్టిందని, లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం తరలింపునకు స్థానికంగా రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ బాధితులకు సేవలు అందించాలన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed