నిజాం పాషా వెనుక ఎంఐఎం!

by Shyam |
నిజాం పాషా వెనుక ఎంఐఎం!
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా ఎంపిక వెనుక ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హస్తం ఉన్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, నిజాంపాషాను ఎంపిక చేయడం ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇటు మైనార్టీలకు అటు బీసీలకు సమన్యాయం చేసినట్టు అవుతోందని టీఆర్ఎస్ అధిష్టానం భావించి ఉంటోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మద్దతు కూడా నిజాంపాషాను చైర్మన్ పదవిలో కూర్చొబెట్టేందుకు దోహదపడ్డాయని ‘నిజాం’ అనుచరులు అంటున్నారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జిల్లా నుంచి మొత్తం15 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు చాలా పేర్లు వినబడ్డాయి. కానీ, టీఆర్ఎస్ అధిష్టానం సీల్డ్ కవర్‌లో పంపిన వారినే పదవులు వరించాయి. సహకార ఎన్నికల్లో మైనార్టీలకు ఒక స్థానాన్ని కట్టబెట్టాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ముందు ఎంఐఎం ప్రతిపాదనలు ఉంచినట్టు సమాచారం. దాంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార డైరెక్టర్ల జాబితాను పరిశీలించారు. అందులో నిజాంపాషా మాత్రమే అర్హునిగా ఉండటంతో ఆయనకు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు డీసీసీబీ చైర్మన్ పదవికి ప్రతిపాదనల్లో ఉన్న విష్ణువర్దన్ రెడ్డి, జక్కారఘు‌నందన్ రెడ్డి, జూపల్లి భాస్కర్‌రావులకు నిరాశే మిగిలింది. పాలమూరు జిల్లానేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కూడా నిజాం పాషాకు లాభం చేకూర్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్న చాలా మంది తొలిసారి కావడం, ఇప్పటికే మక్తల్ పీఏసీఎస్ నుంచి 5 సార్లు ఎన్నికై డీసీఎంఎస్ సిట్టింగ్ చైర్మన్‌గా సి.నిజాంపాషా బాధ్యతలు నిర్వర్తించడం వల్లే ఆయన్ను అనూహ్యంగా డీసీసీబీ చైర్మన్ పదవి వరించిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే, నిజాం పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారనీ, ఆయనకు అంత తొందరగా పదవులు కట్టబెట్టడమేంటనీ టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని ఎందుకు తీసుకోలేదని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story