- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ బాక్స్.. మేడ్ ఇన్ ఇండియా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోవడంతో.. అన్ని దేశాల్లోనూ సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనాకు ఉన్నఫలంగా అడ్డుకట్టవేయడానికి బ్రిటన్, అమెరికా, కెనడా, రష్యా, ఇజ్రాయిల్, మెక్సికో, బహ్రెయిన్, చైనా, స్విట్జర్లాండ్, ఈయూలు అత్యవసర అనుమతి కింద పలు వ్యాక్సిన్‌లకు అనుమతులు ఇచ్చేశాయి. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో ఇప్పటికే ఆరు లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. ‘సీరమ్, భారత్ బయోటెక్, ఫైజర్’ సంస్థలు ఇండియాలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెలాఖరు కల్లా వీటికి అనుమతి లభించినట్టయితే.. జనవరి నుంచి ఇండియాలోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లు పంపిణి చేయాలంటే, వ్యాక్సిన్‌ను స్టోరేజ్ చేసే ట్రాన్స్‌పోర్ట్ బాక్సుల అవసరముండగా, ‘బి మెడికల్ సిస్టమ్స్’ వాటి తయారీలో నిమగ్నమైంది.
యూరోపియన్ దేశమైన ‘లక్సెంబర్గ్’కు చెందిన బి మెడికల్ సిస్టమ్స్.. కొవిడ్ వ్యాక్సిన్‌కు అవసరమైన స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ బాక్సులను తయారు చేసేందుకు ముంబైకు చెందిన పరేఖ్ కంపెనీ సహకారంతో గుజరాత్‌లో ‘మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్’ను నెలకొల్పింది. 40ఏళ్లుగా మెడికల్ రిఫ్రిజరేషన్ డివైజ్‌లను అందిస్తున్న ఈ కంపెనీ, ఎన్నో వ్యాక్సిన్లకు అనువైన రిఫ్రిజిరేటర్స్, ఫ్రీజర్స్, ట్రాన్స్‌పోర్ట్ బాక్సులను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాండర్డ్స్ ప్రకారం అందిస్తోంది. 140 దేశాలకు వీటిని సరఫరా చేస్తున్న కంపెనీ.. గత 20 సంవత్సరాలలో 300 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ వేయడంలో కీలక పాత్ర పోషించింది. కొన్ని వారాల క్రితం ఇండియా, లక్సెంబర్గ్ దేశాధినేతల చర్చల అనంతరం, తొలిసారి తమ దేశంలో కాకుండా భారత్(గుజరాత్)లోనే మొదటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం విశేషం.
‘ఫ్యాక్టరీ నిర్మించడం, ఎక్విప్‌మెంట్ సమకూర్చుకోవడం, టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఏడాదికిపైగా పట్టొచ్చు. కానీ ముంబైకి చెందిన పరేఖ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ సాయంతో ప్రాజెక్ట్ త్వరగా ఫినిష్ చేయగలిగాం. ఒక్కో వ్యాక్సిన్‌కు ఒక్కో తరహా టెక్నాలజీ ఉపయోగించి ఎక్విప్‌మెంట్ తయారు చేయాల్సి ఉండగా, ఎబోలా వ్యాక్సిన్‌ను -80 డిగ్రీల సెల్సియస్, ఫైజర్ -70 డిగ్రీల సెల్సియస్, మోడర్నా -20డిగ్రీల సెల్సియస్ దగ్గర స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. పంపిణీ చేస్తామని ప్రకటించగానే, స్టోరేజ్, ట్రాన్స్‌పోర్టేషన్ బాక్సులను మరింత వేగంగా, అధిక మొత్తంలో తయారుచేస్తాం’ అని కంపెనీ సీఈవో జెసల్ తెలిపాడు.
జనరిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. కీలకమైన ఆరు ముఖ్యమైన టీకాలతో పాటు ఇతర చిన్న టీకాల తయారీకి భారతదేశం కేంద్రంగా నిలిచింది. పోలియో, నిమోనియా, రోటావైరస్, బీసీజీ, మీజిల్స్ (తట్టు), రుబెల్లా వంటి అనేక వ్యాధులకు టీకాలు ఇండియాలోనే తయారవుతుండగా, ఇక కరోనా నియంత్రణకు కూడా స్వదేశీ సంస్థలైన భారత్ బయోటెక్ సంస్థ, సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. బి మెడికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పడంతో ఆయా టీకాలను దేశంలోని మారుమూల గ్రామాలకు చేరవేసేందుకు అనువైన ట్రాన్స్‌పోర్టేషన్, స్టోరేజ్ బాక్సులు మనకు అందుబాటులోకి వచ్చాయి.