దౌలాపూర్ లో పులుల సంచారం కలకలం

by Kalyani |   ( Updated:2025-04-05 16:48:56.0  )
దౌలాపూర్ లో పులుల సంచారం కలకలం
X

దిశ, పాపన్నపేట : పాపన్నపేట మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో రెండు చిరుత పులుల సంచారం శనివారం రాత్రి కలకలం రేపింది. పులులు గ్రామానికి 200 మీటర్ల దూరంలోనే వ్యవసాయ పొలాల వద్ద కొన్ని గంటల పాటు ఒకే చోట ఉండడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రాములు అనే రైతు వ్యవసాయ పొలానికి వెళ్తుండగా కనిపించినట్లు పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేస్తే పొద్దున వరకు ఆ వైపు వెళ్ళకండని ఉచిత సలహాలు ఇస్తున్నారని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ జంతువుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సంబంధిత అధికారులు ఆపత్కాలంలో ఇలా వ్యవహరించడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామస్తులందరూ ఫోన్లు చేసి అధికారులపై మండిపడడంతో ఇద్దరు వాచర్స్ ను పంపి అటవీ శాఖ అధికారులని నమ్మబలికిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పులులు కనిపించాయని అధికారులకు చెబితే రాత్రి 10 గంటలు గడుస్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు వెళ్లకపోవడం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులు ఉన్న రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయంలో పశువులు, మేకలు, ప్రజలపై దాడులు చేస్తాయని బిక్కుబిక్కుమంటున్నారు.

Next Story

Most Viewed