- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, ఫీచర్స్ : ‘జనపనార’ను గంజాయి కుటుంబానికి చెందిన సాగు మొక్కలుగా చెబుతుంటారు. భూమిపై వేగంగా పెరుగుతున్న మొక్కల్లో ఇవీ ఒకటి కాగా.. వీటితో కాగితం, తాడు, వస్త్రాలు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్, జీవఇంధనం సహా ఫైబర్ కూడా తయారుచేయొచ్చు. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా జనపనారతో అనేక ఆవిష్కరణలు పుట్టుకు రాగా, భారత్‌లోనూ ఇందుకు సంబంధించిన అనేక ఉత్పత్తులను చూడొచ్చు. ఇదిలా ఉంటే.. ఆర్కిటెక్ట్ దంపతులు గౌరవ్ దీక్షిత్, నమ్రత కంద్వాల్ జనపనార ఫైబర్‌ను ఉపయోగించి ఓ ఇళ్లు నిర్మించారు. ఈ తరహా నిర్మాణం ఇండియాలోనే మొదటిది కాగా.. గతవారం ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ మోడల్ హౌస్‌ను ప్రారంభించడం విశేషం.
ఆధునిక యుగంలో ఇండ్లను కాంక్రీట్‌తో నిర్మిస్తున్నారని కానీ.. పురాతన కాలంలో మట్టి, సున్నపురాయి మిశ్రమంతోనే పర్యావరణహితంగా నిర్మించేవారు. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా.. ప్రస్తుతం ఎంతోమంది పర్యావరణ ప్రేమికులు తమ కలల సౌధాన్ని మళ్లీ పాత పద్ధతుల్లో కట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరవ్, నమ్రత దంపతులు కూడా ఎకో ఫ్రెండ్లీ నిర్మాణానికే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే జనపనార, కలప, సున్నం మిశ్రమంతో నమ్రత పూర్వీకుల ఇంటి నిర్మాణ శైలి వారికి సమ్‌థింగ్ స్పెషల్‌గా తోచింది. దీంతో కాంక్రీటును భర్తీ చేయగల స్థిరమైన నిర్మాణ సామగ్రి ‘జనపనార ఫైబర్’ అని గ్రహించి 2016లో ‘హెంప్‌క్రీట్’పై పరిశోధన ప్రారంభించారు.
సరైన మిశ్రమం కోసం..
కొన్నేళ్ల పాటు హెంప్‌క్రీట్ సరైన మిశ్రమం కోసం అనేక ప్రయోగాలు నిర్వహించి చివరకు ఫైనల్ మిక్చర్‌ను కనుగొన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆ మిశ్రమాన్ని ఇంటి నిర్మాణానికి ఉపయోగించవచ్చని ప్రపంచానికి చూపించడమే అసలైన టాస్క్‌గా భావించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఏకశిల గోడలను తయారు చేసేందుకు జనపనార-నిమ్మ మిశ్రమాన్ని ఉపయోగించారు. బాత్రూమ్, మరుగుదొడ్లలో వాటర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది గనుక తేమతో కూడిన పరిస్థితుల్లో హెంప్‌క్రీట్ గోడలు ఎలా పనిచేస్తాయో తనిఖీ చేసేందుకు రెండు మిశ్రమాలను (జనపనార ఫైబర్ + సున్నం, జనపనార + స్థానిక మట్టి) ఉపయోగించారు. ఇక రూఫింగ్‌కు కూడా అదే పదార్థాన్ని వినియోగించగా.. ఇంట్లో విద్యుత్ కోసం రూఫ్‌టాప్‌పై అమర్చిన సోలార్ ప్యానల్స్ యూజ్ చేస్తున్నారు.
లాభమేంటి?
కాంక్రీటుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్న ‘హెంప్‌క్రీట్’ పర్యావరణహితమైంది. ‘జనపనార ఫైబర్’ అనేది ఉప ఉత్పత్తి కాగా, దీన్ని వృథా కాకుండా ఉపయోగించుకోవచ్చు. టెక్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమల్లో జనపనార ఫైబర్ వాడకం పెరిగేకొద్దీ అందుబాటులో ఉన్న ముడిసరుకు కూడా పెరుగుతుంది. దీనివల్ల ధరలు తగ్గి, నిర్మాణపరంగా కలిసొస్తుంది. అయితే జనపనార ఇల్లు దృఢంగా ఉంటుందా? లేదా? అనే అనుమానం ప్రతీ ఒక్కరిలో ఉండటం సహజం. అందుకోసమే నిర్మాణ ప్రక్రియలో స్థానిక మేస్త్రీలు, వడ్రంగులు, ఇతర కూలీలకు అవకాశం కల్పించారు. వాళ్లు స్వయంగా ఇందులో భాగం కావడంతో.. హెంప్ క్రీట్ నిర్మాణశైలిపై అవగాహన పెంచింది.
ఫైబర్‌తో ఫర్నిచర్..
మా పరిశోధనలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. పొలంలో పండించగల పదార్థాలను ఉపయోగించి భవనాలను నిర్మించవచ్చని కనుగొన్నాం. అదే విధంగా కాంక్రీట్‌కు ప్రత్యామ్నాయంగా ‘హెంప్‌క్రీట్’ని గుర్తించాం. పురాతన భారతదేశంలో ఇప్పటికే జనపనార ఫైబర్‌తో నిర్మించిన ఇళ్లు అనేకమున్నాయని గ్రహించాం. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత ఎల్లోరా గుహల నిర్మాణంలోనూ జనపనారను ఉపయోగించినట్లు పురావస్తు సర్వే ఆధారాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ‘గోహెంప్ ఆగ్రోవెంచర్స్’(GoHemp Agroventures) స్టార్టప్ ప్రారంభించాం. ఐదేళ్ల పరిశోధన తర్వాత జనపనార ఫైబర్‌తో ఫర్నిచర్ కూడా రూపొందించాం. చెక్క ఫర్నిచర్‌ను పాలిష్ చేసేందుకు జనపనార గింజల నూనెను ఉపయోగిస్తే అవి మరింత నాణ్యంగా కనిపిస్తాయి.
– గౌరవ్ దీక్షిత్
కాంక్రీటు కంటే పదిరెట్లు బలమైంది..
జనపనార.. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. అది పెరుగుతున్నప్పుడు కార్బన్‌ను నిలుపుకుని, ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. జనపనార నిర్మాణాలు రోమన్ కాలం నాటివి. అనేక పదార్థాల కంటే తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉంటాయి. స్థిరమైన, అందమైన నిర్మాణ సామగ్రిని కోరుకునే చాలా మందికి ఇది ఉపయోగకరం. ఇది కాంక్రీటు కంటే పదిరెట్లు బలమైందే కానీ బరువులో మాత్రం ఆరో వంతు ఉంటుంది. హెంప్‌క్రీట్ గోడలు వేడిని నిల్వ చేసుకుంటాయి. భవనం చల్లబడినప్పుడు నెమ్మదిగా విడుదల చేస్తుంటాయి.
– నమ్రత.