మెడికల్ షాపుల్లో మందు గోలీలు లేవ్!

by Sridhar Babu |
మెడికల్ షాపుల్లో మందు గోలీలు లేవ్!
X

దిశ‌, ఖ‌మ్మం : లాక్ డౌన్ సందర్భంగా ఖమ్మం జిల్లాలో మెడికల్ షాపుల్లో మందు గోలీలు అయిపోతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కోవిడ్ -19 కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా షాపుల్లో సప్లైపై ఎఫెక్ట్ పడటం వల్ల, కొంత మంది మందులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల తాత్కాలికంగా స్టాక్ లేదని దుకాణదారులు చెబుతున్నారు. అయితే, బీపీ, షుగ‌ర్‌, హృద‌య రోగుల‌కు సంబంధించిన మందులకు మాత్రం కొర‌త తీవ్రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హోల్‌సేల్ డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ద్ద కూడా స్టాక్ లేకపోవడం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గతం కంటే ఎక్కువ కొనుగోళ్లు..

లాక్‌డౌన్ 2 నుంచి 3 నెల‌ల పాటు కొన‌సాగుతుంద‌న్న అభిప్రాయంతో చాలామంది మందులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇక మ‌రికొంత‌మంది అయితే జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ఇలా సాధార‌ణ జ‌బ్బుల‌కు సంబంధించిన మందుల‌ను సిర‌ప్‌ల‌ను ముందు జాగ్ర‌త్త‌గా కొనుగోలు చేసి తీసుకెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. గ‌తంతో పోలిస్తే హ్యాండ్ వాష్‌, డెటాల్‌లాంటి వంటి కొనుగోళ్లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. మందులు ఎప్ప‌టిక‌ప్పుడు అమ్ముడు పోతుండ‌టంతో ఖ‌మ్మం, కొత్త‌గూడెం ప‌ట్ట‌ణాల్లోని ప్ర‌ధాన డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి పెద్ద మొత్తంలో రిటైల్ దుకాణాదారులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గ‌తంలో ప‌ది నుంచి 15రోజుల్లో అమ్ముడు పోయే కొన్నిర‌కాల మందులు ఇప్పుడు ఒకే రోజు స్టాకు మొత్తం అమ్ముడవుతోంద‌ని రిటైల్ మెడిక‌ల్ షాపు య‌జ‌మానులు చెబుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా జిల్లాలోని ప్ర‌ముఖ మెడిక‌ల్ ఫార్మ‌సీ దుకాణాల‌తో పాటు అపోలో, మెడికేర్ వంటి పేరెన్నిక‌గ‌న్న సంస్థ‌ల అవుట్‌లెట్ల‌లో కూడా బీపీ, షుగ‌ర్‌, హృద‌య రోగుల‌కు సంబంధించిన మెడిసిన్ ల‌భ్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జల అనుమానాల‌ను మ‌రింత పెంచుతున్నాయి. ఈ మందుల‌తో పాటు గ్యాస్‌ట్ర‌బుల్‌, కాల్షియం, పెయిన్ కిల్ల‌ర్స్‌, కోల్డ్ ఫీవ‌ర్‌ను నిరోధించే మందులు దొర‌క‌డం లేద‌ని తెలుస్తోంది. మాస్కులు, శానిటైజ‌ర్స్ ల‌భ్య‌త అయితే గ‌గ‌నంగా మారింది.

ర‌వాణా ఇబ్బందులు…

కొన్ని మెడిసిన్ల కొర‌త ఉన్న‌మాట వాస్త‌వ‌మేన‌ని వ్యాపారులు అంగీక‌రిస్తున్నారు. లాక్‌డౌన్ ప్ర‌భావంతో ర‌వాణాలో కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూట‌ర్లు, పెద్ద దుకాణాల విక్ర‌య‌దారులు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని సీ‌అండ్‌ఎఫ్ కంపెనీకి స్టాకు ఆర్డ‌ర్‌కు పెట్టిన‌ట్లు చాలామంది చెబుతున్నారు. అయితే, లేబ‌ర్ స‌మ‌స్య‌తోనే జిల్లాకు దిగుమ‌తి కావ‌డం లేద‌ని చెబుతున్నారు. మందుల స‌ర‌ఫరాకు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌త్యేక వాహ‌నాల‌ను స‌మ‌కూర్చి రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల‌కు దిగుమ‌తి అయ్యేలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని సూచిస్తున్నారు.

తాత్కాలిక కొర‌తే..

దీర్ఘ‌కాలిక రోగుల‌కు సంబంధించి మందుల కొర‌త ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే, ఇది తాత్క‌లికమే. రెండ్రోజుల్లో దాదాపు జిల్లాకు స‌రిప‌డా స్టాకు దిగుమ‌తి అవుతుంది. గ‌తంలో నెల‌రోజులకు స‌రిప‌డా మందులు తీసుకునే బీపీ, షుగ‌ర్‌, హృద‌య రోగులు లాక్‌డౌన్‌ప‌రిణామాల నేప‌థ్యంలో అతిజాగ్ర‌త్త ప‌డుతున్నారు. 3 నుంచి 4, 5 నెల‌ల‌కు స‌రిప‌డా మందులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం కొన్ని దుకాణాల్లో స్టాకు అయిపోయిన మాట వాస్త‌వ‌మే. అయినా ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. కావాల్సినంత స్టాకు స‌ప్లై చేయ‌డానికి సంస్థ‌లు సిద్ధంగా ఉన్నాయి.

-ర‌మేష్‌, ఖ‌మ్మం జిల్లా కెమిస్ట్ అండ్ డ్ర‌గ్గిస్ట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్‌

Tags: medicine, masks shortage, corona virus, covid 19 effect, lock down

Advertisement

Next Story

Most Viewed