మిలీషియా సభ్యుడికి కరోనా.. ఆదివాసీలు జాగ్రత్త..!

by Sumithra |
Maoist encounter
X

దిశ, భద్రాచలం : పోలీసుల అదుపులో ఉన్న మిలీషియా సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని ఆసుపత్రిలో జాయిన్‌ చేసి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందిస్తున్నట్లు చర్ల సీఐ అశోక్ ధృవీకరించారు. గత కొద్దిరోజుల కిందట చర్ల మండలంలోని కొరకట్పాడు- వీరాపురం అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ 141 బీఎన్ సిబ్బంది కలిసి నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్ట్ పార్టీ మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారిని జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు పంపే క్రమంలో వైద్య పరీక్షలు చేయగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. భద్రాచలం ఏఎస్‌పీ డాక్టర్ వినీత్ ప్రత్యేక చొరవతో అతడిని కోర్టు అనుమతితో భద్రాచలం గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.

ఇంకా అనేక మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు, మిలీషియా సభ్యులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని సదరు అరెస్టు అయిన మిలీషియా సభ్యులు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. మావోయిస్టు పార్టీ దళ సభ్యులు ఏప్రిల్, మే నెలల్లో సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాల ప్రజలను బలవంతంగా తీసుకెళ్లి సమావేశాలు నిర్వహించారని, ఆ సమావేశాలకి వెళ్ళిన వారిలో కొంత మందికి కరోనా సోకి బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉందన్నారు. కానీ, మావోయిస్టు పార్టీ తమ సభ్యులెవరికీ కరోనా సోకలేదని అసత్య ప్రచారం చేస్తూ నిజాలు దాచిపెట్టి ప్రజలను కలవడం, ఆదివాసీ గ్రామాలను సందర్శించడం వలన కరోనా వైరస్‌‌ను వ్యాప్తి చేస్తున్నట్లు వివరించారు. ఆదివాసీ ప్రజలు దళాలను కలవడానికి, మీటింగులకు అడవుల్లోకి వెళ్ళరాదని మీరు కలిసినా లేదా వారు మిమ్మల్ని కలిసిన మీ గ్రామాల్లో కరోనా సోకే ప్రమాదం ఉన్నదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా బారినపడిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోతే చికిత్స చేయిస్తామని సీఐ అశోక్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed