వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

by Shyam |
వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: బతుకు దెరువు కోసం పల్లెను వీడి పట్టణాలకు వెళ్లిన యువత.. కరోనా విజృంభిస్తుండడంతో బతికుంటే చాలని మళ్లీ పల్లె బాట పట్టారు. దీంతో చేసేందుకు పని లేని టైంలో ఉపాధిహామీ పథకం ఆదుకుంది. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూర్​, మహేశ్వరం మండలంలోని చాలా గ్రామాలకు పట్టణాల నుంచి యువకులు వచ్చారు. సిటీలో ఏదో పని చేసేకంటే సొత ఊరిలోనే పని చేస్కుంటే బాగుంటుందని ఉపాధి హామీ పనుల బాట పట్టారు. ఉద్యోగులు, డ్రైవర్లు, ప్లంబర్లు ఇలా ఇతర రంగాల్లో స్థిరపడ్డవారు ఉపాధి పనికి వెళ్లారు. క్లిష్ట సమయంలో పని దొరకడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం, చెక్‌డ్యామ్, ముండ్ల చెట్లను తొలగించి నేలను శుద్ధి చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు కరోనా, మరోవైపు నిరుద్యోగంతో యువత సతమతం అవుతున్న టైంలో పనిదొరకడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. కుటుంబ పోషణ కోసం ఒకరు.. ఖర్చుల కోసం మరొకరు ఉపాధి పనులకు వెళ్తున్నారు.

ఉద్యోగాలు పోయాయి..

కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. నగరంలో కరోనా కేసులు ఎక్కువగా అవుతుండడంతో మరికొందరు ఇంటి బాట పట్టారు. దీంతో అందరూ ఉపాధి పనుల బాట పట్టారు. మహేశ్వరం మండలంలోని దుబ్బచర్ల గ్రామానికి చెందిన శివకుమార్​ హైదరాబాద్‌లో ప్లంబర్​ పనిచేస్తుండే వాడు. కరోనా ఎఫెక్ట్ తో లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి వచ్చాడు. ఊరిలో ఏపని లేకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్​ అనే యువకుడు హైదరాబాద్‌లో ఎస్‌‌ఐ కోచింగ్​ తీసుకుంటున్నాడు. ఊర్లో ఏం పని లేకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. తరుణ్​ అనే యువకుడు హైదారాబాద్​లోని బండ్లగూడ ఆర్టీసీ డిపోలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు. బస్సులు నగరంలో తిరిగే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. కందుకూర్​ మండలంలోని అన్నోజిగూడ గ్రామానికి చెందిన శివకుమార్​ నగరంలోని ప్రైవేట్ స్కూల్​లో పీఈటీగా పనిచేస్తుండేవాడు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తిరిగి సొంతూరికి వచ్చి ఉపాధి హామీ పనిచేస్తున్నాడు. ఇలా ఎంతో మందికి ఉపాధిహామీ జీవనోపాధి అయింది.

అదనంగా 12,664 జాబ్​ కార్డులు..

రంగారెడ్డి జిల్లాలో అదనంగా 12,664 ఉపాధిహామీ జాబ్ కార్డులు పంపిణీ చేశారు. జిల్లాలో 25 మండలాలు, 560 గ్రామాలున్నాయి. వీటిలో 4 మండలాలు పూర్తిగా పట్టణాలు కావడంతో మిగిలిన 21 మండలాల పరిధిలోని గ్రామాల్లోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుండటం గమనార్హం. ఇందులో 550 గ్రామాల్లో విజయవంతంగా ఉపాధి హామీ పథకం కొనసాగుతోంది. గతంలో 1,74, 000 జాబ్​ కార్డులు ఉన్నాయి. ఇందులో సుమారుగా లక్ష జాబ్​ కార్డులున్న లబ్ధిదారులే పనులు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలకు అదనంగా 12,664 జాబ్​ కార్డులు పంపిణీ చేశారు. ప్రతి జాబ్​ కార్డుకు 100 రోజులు పనికల్పించేందుకు అధికారులు ప్రణాళికలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed