పీసీసీ రేసులో ఉన్నాం.. పార్టీకి పనిచేయం 

by Shyam |
పీసీసీ రేసులో ఉన్నాం.. పార్టీకి పనిచేయం 
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొట్లాడే వాళ్లే ఎక్కువ. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్నాం.. పార్టీలో నేనే సీనియర్ నాయకుడిని అని పదవులు పందెంలో ముందంజలో ఉంటారు. కానీ పార్టీ కోసం పని చేయమంటే అందరూ వెనకంజ వేస్తారని ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల ప్రచారం చూస్తే తెలుస్తోంది. టీపీసీసీ పదవికి పోటీపడిన నాయకులంతా ప్రస్తుత ప్రచారంలో ఎక్కడా కనిపించపోవడం గమనార్హం.

అభ్యర్థులు డీలా..

ప్రస్తుతం జరిగే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు నువ్వా నేనా అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. తూటాలాంటి మాటలతో దాడులు చేసుకుంటున్నారు. పంచ్ డైలాగ్ లతో చలి కాలంలోనూ వేడి పుట్టిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ దూకుడు కనిపించడం లేదు. ప్రచారంలో ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు కనుచూపు మేరలో భూతద్దాం పెట్టి చూసినా జాడ కనిపించడం లేదు. ఎక్కడా తమకు మద్దతుగా ప్రచారం చేసే నాయకులు లేక అభ్యర్థులు డీలా పడిపోతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బరిలో దిగిన అభ్యర్థులు బిక్క మొఖంతో చోటమోట కార్యకర్తలతో ప్రచారం చేసుకుంటున్నారు.

గ్రేటర్‌లో ఒకే ఒక్కడు

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉన్న ఏకైక నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయనొక్కడే గ్రేటర్ లో ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రచారం కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్‌లకే పరిమితమైంది. బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా తమ వంతు సహకారం అందిస్తూ ఆ ఏరియాలో రేవంత్.. ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.

హేమాహేమీలు ఏరీ..?

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులమంటూ చెప్పుకునే నేతలు, పీసీసీ మాకివ్వాలంటే మాకు ఇవ్వాలి అనే నాయకులు ప్రచారంలో కనిపించడం లేదు. వారేకాక పార్లమెంట్ పరిశీలకులుగా ఉన్న షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీరే కాకుండా పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వి.హనుమంత రావు లాంటి నేతలెక్కడ అనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాగూర్ లు పార్టీ నాయకులను కోఆర్డినేటర్ చేయడంలో విఫలం అయ్యారని గ్రేటర్ నాయకులు విమర్శిస్తున్నారు.

పేరుకే జిల్లా అధ్యక్షులు…

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్ లు, చివరికి సీపీఐ, సీపీఎం జిల్లాల కార్యదర్శులు సైతం అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పెద్దలకు లేని బాధ మాకెందుకని నామమాత్రంగా అభ్యర్థుల వైపు తిరుగుతున్నారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కు జిల్లా పై పెద్దగా పట్టు లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి సీనియర్ అనే భావనతో పార్టీ పదవి ఇచ్చారట. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం ఇతర జిల్లా అధ్యక్షులతో పోల్చితే కొంత బెటర్. అతడికి ఎంపీ రేవంత్ సపోర్ట్ బలంగా ఉంది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడే జిల్లాలో పర్యటిస్తున్నారు. మిగిలిన అధ్యక్షులు కేవలం వారి ప్రాంతంలో ఉండే డివిజన్ లకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. కాగా గ్రేటర్ బరిలో రంగారెడ్డి పరిధిలో 36, మేడ్చల్ లో 38, హైదరాబాద్‌లో 76డివిజన్ లు ఉన్నాయి. అగ్ర నేతలు ప్రచారం చేయని ఈ ఎన్నికల్లో అత్యధిక డివిజన్ లు ఏ జిల్లాలో గెలుస్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story