మామిడి బిజినెస్ ఢమాల్

by Shyam |   ( Updated:2021-05-13 10:33:38.0  )
మామిడి బిజినెస్ ఢమాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మామిడి బిజినెస్ కుదేలైంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో అమ్మకాలు తగ్గి వ్యాపారం లేకుండా పోయింది. షాపులు, గోడౌన్లలోనే పండ్లు కుళ్లిపోతున్నాయి. దీంతో వ్యాపారులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. గతేడాది కూడా లాక్ డౌన్ కారణంగా బిజినెస్ లేక నష్టపోయిన వ్యాపారులు ఈ ఏడాది కూడా నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో పండ్ల ట్రాన్స్ పోర్టుకే సమయం సరిపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకెళ్లినా సమాయం లేకపోవడం వల్ల మరుసటి రోజు అమ్మకాలు చేసేలోపే కుళ్లిపోతున్నట్లు వాపోతున్నారు. అయితే గురువారం మార్కెట్ కు ఆశించినంత స్థాయిలో పండ్ల దిగుమతులు జరగకపోవడంతో పలు దుకాణాలు వెలవెలబోయాయి.

500 టన్నులే దిగుమతి

హైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ తెలంగాణలోనే అతిపెద్దది. మార్చి మొదటివారం నుంచి మామిడి సీజన్ ప్రారంభమవుతుంది. ఈ మార్కెట్ కు తెలంగాణలోని జహీరాబాద్, కరీంనగర్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ తో పాటు పలు ప్రాంతాల నుంచి మామిడి పండ్లు దిగుమతి అవుతాయి. మామిడి పండ్ల సీజన్ లో ప్రతిరోజు ఈ మార్కెట్ కు కనీసం 1700 టన్నుల నుంచి 1800 టన్నుల మామిడి దిగుమతి జరుగుతుంది. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ కు తోడు రంజాన్ ను పురస్కరించుకొని గురువారం కేవలం 500 టన్నుల మామిడి మాత్రమే మార్కెట్ కు చేరుకుంది.

మామిడి సీజన్ లో ప్రతి ఏటా లక్షల టన్నులు దిగుమతి జరిగి కోట్లల్లో సాగే వ్యాపారం లాక్ డౌన్ కారణంగా తక్కువ స్థాయిలో జరగడాన్ని చూస్తే వ్యాపారులు ఎంతమేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా దిగుమతులే కాక ఇక్కడి నుంచి ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ప్రాంతాలకు పండ్ల ఎగుమతి జరుగుతోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఎగుమతులు కూడా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా అనుమతించకపోవడంతో పండ్లు కుళ్లిపోతున్నాట్లు వాపోతున్నారు. కరోనాకు భయపడి లేబర్లు కూడా సరిగ్గా రాకపోవడం వల్ల ట్రాన్స్ పోర్టుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబపోషణ భారం

పండ్ల వ్యాపారాన్నే నమ్ముకుని జీవిస్తున్న వారికి లాక్ డౌన్ కారణంగా నష్టాలు వాటిల్లడంతో కుటుంబపోషణ భారమవుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు 10 దాటితే వెంటనే వెళ్లిపోవాలని సూచిస్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నట్లు వాపోయారు. కొవిడ్ కు భయపడి లేబర్లు కూడా రాకపోవడంతో లోడ్ ఎత్తేందుకు, దింపేందుకు అధిక మొత్తాన్ని వారు వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా తోపుడు బండ్ల వ్యాపారుల పరిస్థితి మరింత దీనంగా మారింది. రోజుకు కనీసం రూ.1000 సంపాదించే వారు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల రూ.200 సంపాదించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సమయం ఉండటం వల్ల లోడింగ్ కే సమయం సరిపోతోంది. ఉదయం 8 గంటల వరకు వాళ్లు మార్కెట్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇంకా అమ్మకాలు చేపట్టేదెప్పుడంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రూ.200 తో కుటుంబాన్ని పోషించేదెలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు ఎన్నో పోషకాలు అందిస్తాయని, కరోనాను నియంత్రించేందుకు ఇది ఒక ఔషధంగా పనిచేస్తుందని వారు తమ బాధను వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వం చొరవచూపి పండ్ల అమ్మకానికి మరింత ఎక్కువ సమయం కేటాయించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా మామిడి అమ్మకాలు, కొనుగోలు విషయంలో అటు మార్కెట్ వర్గాలు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిజినెస్ బాగానే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుంటే సమయం తక్కువగా ఉండటం వల్ల బిజినెస్ దెబ్బ తింటోందని వ్యాపారులు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story