- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా బతుకులు నవ్వులపాలు చేసిండ్రు.. కలెక్టర్ ఇట్లనే ఉంటడా?
దిశ ప్రతినిధి, మెదక్: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు అక్కడ పంటలు, పచ్చని పొలాలతో అద్భుతంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మఖ్యమంత్రి కేసీఆర్ 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రాజెక్టు నిర్మాణం నుంచి పరివాహక ప్రాంతాల ప్రజల బతుకులు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. తమ జీవితాలను టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు నవ్వులపాలు చేశారని నిర్వాసితులు బోరున విలపిస్తు్న్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో భూసేకరణ చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణనికి నిర్వాసితులు భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులు కొందరిని ఒప్పించి, మరికొందరిని బెదిరించి భూములు లాక్కున్నారు. పుట్టిన ఊరు, నమ్మిన నేలను వదిలి వెళ్లలేక చాలా గ్రామాల ప్రజలు పోరాటాలు, ఉద్యమాలు చేశారు. అప్పటి నుండి ఆ గ్రామాలు, ఆ కుటుంబాల్లో అంధకారం నిండుకుంది. మాకు ప్రాజెక్ట్ వద్దు అంటూ ఎదిరించి పోరాటాలు చేసిన వారిపై అధికారులు, పోలీసులు లాఠీ దెబ్బలు, ఉక్కుపాదం మోపి వారి ఆకాంక్షను అణగదొక్కారు. ఆ గ్రామాలకు కరెంట్, మంచి నీళ్ల సరఫరా, రహదారులు నిలిపివేసి బలవంతపు భూసేకరణ చేశారు.
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకుండా ససేమీర అంటుంటే.. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకుండానే ట్రయల్ రన్ పేరిట నీళ్లు వదిలి నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేసేలా కుట్రలు చేశారు. ఎంతోమంది నిర్వాసితులు పూర్తి స్థాయిలో ప్యాకేజీ ఇవ్వాలని ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వాసితుల ఇండ్ల కుల్చివేతలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో తమ సొంత గ్రామాలను, పాడి పంటలను వదిలి తట్టబుట్ట నెత్తిన ఎత్తుకొని పిల్లల్ని నిర్వాసితుల కాలనీకి వెళ్లిన బాధితులను ప్రభుత్వం నవ్వుల పాలు జేస్తోంది. ఒకప్పుడు పాడి పంటలతో చేతినిండా పనితో ఆనందంగా ఉండే వారికి, ఇళ్లు, భూములు లాక్కొని రోడ్డున పడేశారు. దీంతో వారి జీవితాలు ఆందోళనకరంగా మారాయి. చిన్న వర్షానికే ఇళ్లంతా ఆగమాగం అవుతోందని వాపోతున్నారు. కనీసం పడుకోవడానికి చోటులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి పరిస్థితిని చూసిన వారి కళ్లలో కన్నీరు ఆగడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక కలెక్టర్ తమను బలవంతంగా తమను ఖాళీ చేయించి రోడ్డుమీదకు నెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారికి మా ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. తమకు ప్రభుత్వం ఇస్తామన్న హామీ మేరకు పూర్తి ప్యాకేజీ ఇవ్వకుంటే తమకు చావే దిక్కంటున్నారు.
పని దొరకడం లేదు : మల్లయ్య, నిర్వాసితుడు
మేం వ్యవసాయం చేసుకొని బతుకు బండి నడిపే వాళ్ళం. మాకు వ్యవసాయ పనులు తప్పితే వేరే పనులు రావు. ఇక్కడ ఏం పని చేద్దామన్నా దొరుకుతలేదు. ప్రాజెక్టులో భూమి పోయింది. భూమికి వచ్చిన పైసలతో తిని పడుకుంటున్నాం. పైసలు అయిపోతే ఏం జేసేది.. ఎట్లబతికేది. తలుచుకుంటే భయమేస్తోంది.
మీరు ఇట్లనే బతుకుతున్నరా? : అనిత, నిర్వాసితురాలు
మా ఊరిలో వ్యవసాయం చేసుకొని హాయిగా బతికేవాళ్లం. ఆవులు, మేకలు, పిల్లలతో సుఖంగా ఉండేటోళ్లం. కేసీఆర్, కలెక్టర్ మమ్మల్ని ఎక్కడ గాకుండా జేసి ప్రాజెక్టులో ముంచిర్రు. ఇక్కడ ఇచ్చిన ఇల్లు ఉరుస్తుంది. పడుకుందామంటే జాగలేదు. అన్ని సామాన్లు తడిసిపోతున్నాయి. మీరు గిట్లనే బతుకుతుర్రా.. మీవి బతుకులు గాని మావి కాదా.?
మాతో ఉండి చూడండి.. మా బాధ తెలుస్తది : లక్ష్మి, నిర్వాసితురాలు
ఇక్కడ ఇల్లు ఇచ్చారన్న పేరే కానీ, వాన వస్తే నిలబడే జాగలేదు. పిల్లలను ఎత్తుకొని నిలబడుతున్నాం. మీ ఇండ్లైతే గిట్లనే కట్టుకుంటారా..? మాతో ఒక్కరోజు ఉండి చూడండి. మా బాధలు తెలుస్తయ్. మీ భార్యాపిల్లలను గిట్లనే ఉంచుతారా? సార్లు.
ప్యాకేజీ ఎందుకిస్తలేరు : లావణ్య, నిర్వాసితురాలు
మమ్మల్ని ఖాళీ చేయించేటప్పుడు బర్లకు, గొర్లకు, బాయికి, ఇంటి స్థలానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎదిగిన పిల్లలకు ప్యాకేజీ ఇస్తామన్నరు. ఇప్పుడు ఇస్తామన్న ప్యాకేజీ ఎందుకిస్తలేరు. కనీసం అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కలెక్టర్ భూములు తీసుకునేటప్పుడు మస్తు మాటలు చెప్పిండు. ఇప్పుడు ఆ సార్లు ఎవరూ కనిపించడం లేదు.