ప్రజాప్రతినిధులను దహించి వేస్తున్న ‘దళిత బంధు’..

by Shyam |   ( Updated:2021-07-29 05:53:39.0  )
bjym
X

దిశ, శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకం అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మెడకు చుట్టుకున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో తొలుత అమలు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే.. తమ నియోజకవర్గాల్లోనూ దళితబంధు ఇవ్వాలని దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. దళిత బంధు ఇప్పిస్తారా లేదా పదవికి రాజీనామా చేస్తారా..? అంటూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఆయా నియోజకవర్గాల ప్రజలు డెడ్ లైన్ విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేయాలని లేదా రూ.10 లక్షల దళిత బంధు పథకాన్ని తమకూ వర్తించేలా చూడాలన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధికి రూ.వేల కోట్లు వచ్చేలా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ పి.అశోక్ ఆధ్వర్యంలో వివేకానంద డివిజన్ బీజేపీ అధ్యక్షుడు డి.నర్సింగ్ రావు, జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్‌లు వెంకటేశ్వర నగర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితుల మీద ప్రేమ చూపిస్తున్నారని, అందులో భాగంగానే దళిత బంధు పథకాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శించారు. ఉప ఎన్నికలు జరిగే ప్రతీచోట కోట్ల రూపాయలు వెదజల్లి గెలుస్తున్నారని, అదే విధానాన్ని హుజురాబాద్‌లోనూ అమలు చేయాలని చూస్తున్నట్లు మండిపడ్డారు. దళితుల మీద ఏ మాత్రం ప్రేమున్నా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అలా చేస్తే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని దళితులకు కూడా రూ.10 లక్షల దళితబంధుతో పాటు, నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎస్సీ మోర్చా నాయకులు రమేష్, ఉపేందర్, యాకయ్య, డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు గణేష్ గౌడ్, దయాకర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తిమ్మయ్య, లక్ష్మణ్, బొట్టు శ్రీను, బీజేవైఎం అధ్యక్షుడు సాయికిరణ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మమతా, సంధ్య, శృతి గౌడ్, సభారతీ, గీత, ఉపేంద్ర, శాలిని, సత్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed