అమెజాన్ డెలివరీలకు మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు!

by Harish |   ( Updated:2021-02-23 04:50:49.0  )
Mahindra Electric Vehicles
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా, దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ సంస్థలు తమ కీలక భాగస్వామ్యాన్ని మంగళవారం ప్రకటించాయి. కస్టమర్లకు వస్తువుల సరఫరా చేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్టు, దీనికోసం మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది.

దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే మహీంద్రా ‘ట్రియో జోర్’ త్రీ-వీలర్లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ‘కార్బన్ ఉద్గారాలను నివారించి, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో అమెజాన్‌తో భాగస్వామ్యం సంతోషంగా ఉంది. ‘ట్రియో జోర్’ అత్యుత్తమ శక్తితో, విలువైన సేవలని కస్టమర్లకు అందిస్తుందని’ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీఎండీ మహేష్ చెప్పారు. గతేడాది జనవరిలో ప్రకటించిన దాని ప్రకారం..2025 నాటికి కంపెనీ తన డెలివరీల కోసం 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలనే లక్ష్యానికి మహీంద్రాతో భాగస్వామ్యం దోహదపడుతుందని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

అలాగే, మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం 2025-26 ఆర్థిక సంవత్సరం సమయానికి రూ. 10 వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా కలిగి ఉంది. కాగా, ప్రస్తుతం దేశీయంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాహనాల విభాగంలో మహీంద్రా ‘ట్రియో జోర్’ 56 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. వీటిలో అమెజాన్‌తో పాటు బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్ సహా ఇతర ఈ-కామర్స్ కంపెనీలను మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed