మహేష్, చిరు మల్టీస్టారర్ మూవీ?

by Shyam |
మహేష్, చిరు మల్టీస్టారర్ మూవీ?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు పంథా మార్చాడా? మల్టీ స్టారర్ మూవీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ మూవీ చేసి హిట్ కొట్టిన మహేష్… ఆ జోనర్‌ను ఎంజాయ్ చేస్తున్నారా? అంటే ఔననే అనిపిస్తుంది ఫిల్మ్ నగర్ గాసిప్స్‌ వింటుంటే.

తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు తర్వాత చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయబోతున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘భాషా’ లాంటి పవర్ ఫుల్ కథతో గ్యాంగ్ స్టర్‌గా, ప్రొఫెసర్‌గా టూ షేడ్స్‌లో రఫ్ఫాడిస్తాడట. అయితే ఆ తర్వాత మహేష్ రెండు చిత్రాలు కూడా మల్టీస్టారర్ మూవీసే అనేది టాక్.

‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ‘ఎఫ్3’ మూవీలో వెంకీ, వరుణ్ తేజ్‌తో కలిసి హంగామా చేయనున్నాడట ప్రిన్స్. ‘ఎఫ్2’కు మించిన కామెడీ స్క్రిప్ట్‌తో వస్తున్నఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఎంటర్ అయ్యే మహేష్ ప్రేక్షకులను తెగనవ్విస్తాడట. ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన మహేష్ బాబు ‘ఎఫ్3’లోనూ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నారట.

ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’లోనూ మహేష్ బాబు .. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ముందుగా నక్సలైట్ రోల్ కోసం రామ్‌చరణ్‌ను ఎంచుకున్నారట. కానీ, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ లాక్ అయిపోవడంతో ఈ పాత్ర కోసం మహేష్‌ను సంప్రదించారట. పాత్ర నచ్చడం .. కొరటాల శివ స్నేహితుడు కావడం… చిరు అంటే అభిమానం ఉండడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట మహేష్. 25 నిమిషాల నిడివితో ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సరికొత్తగా కనిపించనున్నారట.

Advertisement

Next Story