- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ కార్మికులకు ఏప్రిల్ జీతం ఇస్తారా.. ఇవ్వరా!?
దిశ, న్యూస్‌బ్యూరో: కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్న ఆర్టీసీపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. ‘‘మూలిగే నక్కపై తాటికాయ’’ చందంగా ఆర్టీసీ మరింత నష్టాల్లోకి పోతోంది. గతేడాది 56 రోజుల సమ్మెతో ఆర్టీసీ సుమారు రూ. 683 కోట్లు నష్టపోయింది. ఇప్పుడు లాక్‌డౌన్-1 కాలంలో సుమారు రూ. 225 కోట్లు నష్టపోయింది. ఇక లాక్‌డౌన్-2 మే 3వ తేదీతో ముగుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం 7వ తేదీ వరకు కొనసాగించనుండడంతో మరో రూ. 250 కోట్ల మేర నష్టం అనివార్యం కానుంది. గతేడాది 56 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మె కారణంగా నష్టపోయిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి టికెట్ల ధరలు పెంచక తప్పలేదు. కరోనా లాక్‌డౌన్‌తో జరిగే నష్టాన్ని పూడ్చుకునే మార్గాల గురించి ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది.
మామూలుగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ. 12.5 కోట్ల చొప్పున ప్రతీ నెలా కనీసంగా రూ. 375 కోట్ల ఆదాయం సమకూరుతుంది. దీనికి తోడు దుకాణాల అద్దెలు, స్థలాల లీజ్ తదితరాల నుంచి సుమారు రూ. 35కోట్లు వస్తాయి. ఈ ఆదాయం నుంచే సంస్థలోని సుమారు 49 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు అందుతాయి. లాక్ డౌన్ మూలంగా ఇప్పుడు ఆదాయం ఏమీ లేకపోవడంతో మే నెలలో అందుకునే ఏప్రిల్ నెల జీతం ఏమవుతుందా అని కార్మికులు ఆందోళన పడుతున్నారు.
లాక్‌డౌన్ ఎఫెక్ట్ కనీసం ఐదారు నెలలు కోలుకోనివ్వదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా కూడా ‘సోషల్ డిస్టెన్స్’ పేరుతో పరిమిత సంఖ్యలోనే ప్రయాణీకులు ఉంటారు కాబట్టి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేరళ రోడ్డు రవాణా సంస్థ బస్సులో సీటుకొకరి చొప్పున మాత్రమే కూర్చోబెడుతోందని, తెలంగాణలో సైతం అదే కొనసాగించక తప్పదని ఆయన గుర్తుచేశారు. ప్రతీ నెలా ఆర్టీసీకి సుమారు రూ. 400 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులో మెజారిటీ బస్సు టికెట్ల ద్వారానే సమకూరుతుంది. మార్చిలో పది రోజుల లాక్‌డౌన్ కారణంగా వేతనాల్లో 50% కోత పడడంతో ఏప్రిల్ మొత్తం లాక్‌డౌన్‌లోనే ఉన్నందున మే నెలలో అందుకునే వేతనాలు వస్తాయో రావో, వచ్చినా ఎంత కోత పడుతుందోననే ఆందోళన కార్మికుల్లో నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల పరిధిలో 7,300 ఆర్టీసీ బస్సులు, 2800 అద్దె బస్సులు, 49 వేల మంది సిబ్బందితో కోటి మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. సమ్మెకాలానికి జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇంకా 12రోజుల వేతనాలు అందలేదు. ఆదాయం ఉన్న రోజుల్లోనే వేతనాలు ఇవ్వడానికి యాజమాన్యం నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు కరోనా దెబ్బ నుంచి సంస్థ ఎప్పటికి కోలుకుంటుందో అనేది యాజమాన్యాన్నేగాక కార్మికులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. సమ్మె షాక్ నుంచి పూర్తిగా బయటపడకముందే లాక్‌డౌన్ వచ్చిపడి, మరింత నష్టాల ఊబిలోకి వెళ్ళక తప్పేట్లు లేదు. లాక్‌డౌన్ ఎత్తివేసే సమయానికి కరోనా పేషెంట్లు తగ్గవచ్చుకాని కరోనా పూర్తిస్థాయిలో తగ్గిందన్న నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. సోషల్ డిస్టెన్స్ పేరుతో ఆర్టీసీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండనుంది. ఇలాంటి విపత్కర మైన పరిస్థితిలో ఆర్టీసీకి ప్రభుత్వం పత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటే తప్ప కోలుకునే పరిస్థితి లేదని కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకుంటే మరోసారి టికెట్ల రేట్లు పెంచి ప్రజలపై భారం మోపే ఆవకాశం లేకపోలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
– ఎస్.వీ రావు, ఎస్‌డబ్య్లూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌తో ఆర్టీసీకీ వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రభావం మరో మూడు నెలలు వరకూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కార్మికులు కూడా 50 శాతం వేతనాలు తీసుకోవాడానికే మానసికంగా సిద్ధమయ్యారు. కానీ భవిష్యత్తులో ఈ వేతనాలు కూడా వస్తాయన్న స్పష్టత లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వమే ఆర్టీసీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలి.
Tags: RTC, income, Buses, Lockdown, Coronavirus, Covid-19, Salaries, Wages