సిమ్లాలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు.. ప్రభుత్వం కీలక ఒప్పందం

by srinivas |
సిమ్లాలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు.. ప్రభుత్వం కీలక ఒప్పందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర రాష్ట్రాలలో విద్యుత్ ఉత్పతి ప్లాంట్ల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 22 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న శనివారం సిమ్లాలో తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలు, హిమాచల్ ప్రదేశ్ లోని రెండు ప్రధాన హైడ్రో పవర్ ప్రాజెక్టులైన సెలి (400 మెగావాట్లు) , మియార్ (120 మెగావాట్లు) అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా పొందే విద్యుత్ తెలంగాణ రాష్ట్ర క్లీన్​అండ్​గ్రీన్​ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుంది. ఇందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల మధ్య విద్యుత్ ఉత్పత్తి పై అవగాహన ఒప్పందం కుదిరింది. సెలి (400 మెగావాట్లు ), మియార్ (120 మెగావాట్లు ) జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం తీసుకోనుంది. తెలంగాణ క్లీన్​అండ్​ గ్రీన్​ఎనర్జీ పాలసీ 2025 లో భాగంగా 2030 నాటికి 20 మెగావాట్లు, 2035 నాటికి 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. హిమాచల్ జలవనరుల వినియోగం ద్వారా తెలంగాణ ప్రజలకు తక్కువ ఖర్చుతో, విశ్వసనీయమైన, పర్యావరణ హిత విద్యుత్ సరఫరా చేయడం ఈ ఒప్పందం లక్ష్యంగా ఉండనుంది. హైడ్రో విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువ కావడమే కాకుండా థర్మల్ పవర్ తో పోల్చినపుడు ఆర్థికంగా మరింత తగ్గనుంది. హిమాచల్‌లో సంవత్సరానికి 9-10 నెలలు హైడ్రో పవర్ ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉండడంతో ఇక్కడి ప్రాజెక్టులను తెలంగాణ జెన్​కో నామినేషన్ పద్ధతిలో చేపడుతుంది. ఒక రకంగా ఇది అంతర్రాష్ట్ర విద్యుత్ సహకారానికి గొప్ప ఉదాహరణ కూడానని అధికారులు పేర్కొంటున్నారుజ. ఈ ఒప్పందం తెలంగాణ -హిమాచల్ మధ్య బలమైన సంబంధాలకు ప్రతిబింబంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ విద్యుత్ చరిత్రలో చారిత్రాత్మకమైన ఘట్టం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వ విధానం విద్యుత్ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోందని, పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ కృషి సాగుతుందని, ఈ ఒప్పందం తెలంగాణ విద్యుత్ చరిత్రలో చారిత్రాత్మకమైన ఘట్టం గా నిలుస్తోంది ” అని పేర్కొన్నారు.

ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టీజీ ఎస్​పీడీసీఎల్​సీఎండి ముషారఫ్ ఫరూఖి, జెన్​కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Next Story