యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీగా ఆఫ్రికన్ అమెరికన్?

by vinod kumar |
యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీగా ఆఫ్రికన్ అమెరికన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా డిఫెన్స్ సెక్రెటరీగా తొలిసారి ఆఫ్రికన్ అమెరికన్ నియామకం కాబోతున్నారు. అగ్రరాజ్యం నూతన అధ్యక్షుడు జో బిడైన్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ లాయిడ్ ఆస్టిన్‌ను పెంటగాన్‌ రక్షణ కార్యదర్శిగా నియమించబోతున్నారని అక్కడి ప్రముఖ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ విషయాన్నిసెనేట్ ధృవీకరించినట్లయితే 67ఏళ్ల వయస్సున్న మిలిటరీ ఆఫీసర్ రక్షణ శాఖకు నాయకత్వం వహించిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కానున్నారు.

అయితే, ప్రెసిడెంట్ ఎన్నుకున్న కార్యాలయ బృందం ఈ వార్తను ఇంకా ధృవీకరించలేదు. బైడెన్ తన క్యాబినెట్‌కు చెందిన అదనపు సభ్యులను క్రిస్మస్ పండుగ ముందు ప్రకటించనున్నారని సమాచారం. ఇందులో రక్షణ కార్యదర్శికి నామినీ మరియు ఈ వారం ముగిసేలోపు తన ఆర్థిక, దేశీయ మంత్రివర్గ సభ్యులతో సహా రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్ పెంటగాన్‌కు నాయకత్వం వహించడానికి ఎంపికవుతారని పొలిటికో నివేదిక పేర్కొంది.

యుఎస్ సెంట్రల్ కమాండ్ మాజీ కమాండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆస్టిన్‌ను బైడెన్ రక్షణ కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ సీఎన్ఎన్ కూడా ఓ సందర్భంలో ఉటంకించింది. అయితే, ఆస్టిన్ 2013 నుంచి 2016 వరకు యూఎస్ సెంట్రల్ కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో పనిచేశారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్ ఉన్నత సైనిక నాయకత్వంతో సన్నిహితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, అమెరికా చట్టాల ప్రకారం మిలిటరీ మాజీ సభ్యుడు రక్షణ కార్యదర్శిగా పనిచేయడానికి కనీసం ఏడేళ్లు ముందు యూనిఫాం నుంచి బయటపడాలి. అమెరికా రక్షణ శాఖ పౌర స్వభావాన్ని కాపాడటానికి ఈ చట్టాలు ఉద్దేశించబడినవి. అయితే, 2012లో ఆస్టిన్ ఆర్మీ మొదటి ఆఫ్రికన్-అమెరికన్ వైస్ చీఫ్‌గా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత, అతను యూఎస్ సెంట్రల్ కమాండ్ బాధ్యతలు స్వీకరించాడు. 2016లో ఆయన ఆర్మీ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. దీని ప్రకారం చూసుకుంటే 2021 ప్రారంభంలో అతను సర్వీసు నుంచి దూరమై కేవలం నాలుగేళ్లు మాత్రమే అవుతుంది. దీన్నిబట్టి ఆస్టిన్ అమెరికన్ డిఫెన్స్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టాలంటే మరో మూడేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed