చింతమనేని అరెస్టును ఖండిస్తున్నా: లోకేశ్

by srinivas |
చింతమనేని అరెస్టును ఖండిస్తున్నా: లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరెస్టును ఖండిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై ఏలూరు సమీపంలో కలపర్రు టోల్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు శుక్రవారం చింతమనేని ప్రయత్నించారు. దీంతో కరోనా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ చింతమనేనితో పాటు మరో ఎనిమిది మందిపై
పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

అనంతరం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రభాకర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

దీనిపై నారా లోకేశ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘చింతమనేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. కొవిడ్-19 నిబంధనలు ఒక్క టీడీపీ నాయకులకేనా? చింతమనేని ఎక్కడా గుంపులుగా తిరగలేదు. వెంట అనుచరులు లేరు. ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆఖరుకి కరోనాని కూడా వేధింపుల కోసం వాడుకుంటున్న జగన్ గారి మానసిక స్థితిని చూసి జాలేస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులు కోవిడియట్స్‌గా మారారని జాతీయ మీడియా సైతం ఉతికి ఆరేసింది. గుంపులుగా తిరిగి, ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై కేసులు ఉండవా?’ అని ప్రశ్నించారు. కాగా, ఈ కేసులో చింతమనేనితో పాటు మరో ఎనిమిది మంది అనుచరులను రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed