- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సభకు ‘సాగు’ సెగ.. బీజేపీ ఎంపీలపై మోడీ ఆగ్రహం
న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఒక్క రోజు కూడా సభ సాఫీగా సాగడం లేదు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై చర్చించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు ఇతర విపక్షాలు పట్టుబడుతుండగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పక్షం మాత్రం వాటిమీద చర్చించడం కుదరదని చెబుతున్నది. ఫలితంగా మూడో రోజూ ఉభయ సభలు స్తంభించాయి. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటును ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ఇరు సభాపతులు ప్రకటించారు.
పెట్రో ధరలు, సాగు చట్టాలపై చర్చ జరగాల్సిందే..
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, నూతన సాగు చట్టాలపై చర్చకు అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. బుధవారం కూడా ఎగువ సభ ప్రారంభం కాగానే ఈ విషయాన్ని చర్చించాలని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభ చైర్మెన్‌కు నోటీసు ఇచ్చారు. కానీ వెంకయ్యనాయుడు దీనికి ససేమిరా ఒప్పుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలనీ, వాటి మీదే చర్చించాలని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వారిస్థానాల్లోంచి లేచి నినాదాలు చేశారు. వెల్ లోకి దూసుకుపోయి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు పలు దఫాలు సభను వాయిదావేశారు. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభమవగా.. అదే సీన్ రిపీట్ అయింది. ఆందోళనల నడుమే రాజ్యసభలో ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ (సవరణ) బిల్లు పాసైంది. ఈ బిల్లుకు మంగళవారమే లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
లోక్‌సభలోనూ అంతే..
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలోనూ సాగు చట్టాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ప్రధాన ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా కాంగ్రెస్ సభ్యులంతా నినాదాలతో హోరెత్తిస్తూ సభను స్తంభింపజేశారు. నిరసనల నడుమే సభ సాగింది. ఓవైపు నినాదాలు హోరెత్తుతున్నా.. ప్రభుత్వం మాత్రం ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ (స్పెషల్ ప్రొవిజన్స్) సెకండ్ (అమెండ్‌మెంట్) బిల్లు 2021, కాన్స్టిట్యూషన్ (షెడ్యూల్ కాస్ట్స్) ఆర్డర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2021’ లను సభలో ప్రవేశపెట్టింది. వీటితో పాటు రైల్వే, విద్యారంగాల కేటాయింపుల మీద చర్చకు పెట్టింది.
పలువురు శివసేన ఎంపీలు రైల్వే కేటాయింపులలో తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. గత ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించాయనీ, కానీ తాము మాత్రం రాష్ట్రాల సహకారంతో పనులు కూడా చేస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రం మీద తమకు వివక్ష లేదని అన్నారు. ఇదిలాఉండగా ప్రతిపక్ష సభ్యుల నిరసనలు హోరెత్తడంతో స్పీకర్ ఓంబిర్లా 12.30 గంటలకు కొద్దిసేపటిదాకా సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా నిరసనలు ఆగలేదు. నిరసనల మధ్యే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ (స్పెషల్ ప్రొవిజన్స్) సెకండ్ (అమెండ్‌మెంట్) బిల్లు 2021 ను ప్రభుత్వం వాయిస్ ఓట్‌తో ఆమోదించుకుంది. ప్రతిపక్ష నేతలు నిరసనలు, ఆందోళన ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి దిగువ సభనూ ఈనెల 15 దాకా వాయిదా వేశారు.
ఎంపీల గైర్హాజరీపై మోడీ ఫైర్
బీజేపీ ఎంపీలు పార్లమెంటుకు గైర్హాజరీ కావడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బాధ్యతలు అప్పగించిన ఎంపీలు తప్ప మిగిలిన వారంతా విధిగా పార్లమెంటుకు విధిగా హాజరు కావాల్సిందేనని తెలిపినట్టు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎంపీ అన్నారు. ఈ విషయంపై పదే పదే గుర్తు చేయడం తగదని ఎంపీలకు మోడీ హితువు పలికారు.