ఆటంకం ఏర్పడుతోన్నది..

by Sridhar Babu |
ఆటంకం ఏర్పడుతోన్నది..
X

దిశ‌, ఖ‌మ్మం: మామిడి రైతుల క‌ష్టాన్ని వ్యాపారులు దోచేస్తున్నారు. ర‌వాణా సాకు చూపి అగ్గువ‌కే కొనుగోలు చేస్తూ రైతుకు చెందాల్సిన క‌నీస లాభాన్ని కూడా దోచుకుంటున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చాలామంది రైతులు వేలాది ఎక‌రాల్లో మామిడి తోటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో పండిన మామిడిని మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, హర్యానా, పంజాబ్‌, నాగ్‌పూర్‌, ఉత్తరప్రదేశ్‌, మీరట్‌, లక్నో, రాజస్థాన్‌, ఏవుల, చంద్రాపూర్‌, కోల్‌క‌తా వంటి సుదూర ప్రాంతాల‌కు ఎగుమ‌తి చేస్తుంటారు. చిన్న రైతుల నుంచి వ్యాపారులు మామిడి ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసి నాగ‌పూర్‌లాంటి పెద్ద మార్కెట్‌కు త‌ర‌లించి లాభాలు పొందుతుంటారు. రైతుల‌కు కూడా ఉన్నంత‌లో బాగానే గిట్టుబాటు అయ్యేది. అయితే ఈ సంవ‌త్స‌రం మాత్రం మామిడి రైతుల‌పై లాక్‌డౌన్ ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది. పంట కోయ‌డానికి కూలీలు దొర‌క‌డం లేదు. కోసిన మామిడిని కుప్ప పోయ‌టం, ప్యాకింగ్ చేయ‌డం, వాహ‌నాల్లోకి ఎక్కించ‌డం, అక్క‌డి నుంచి అనుకున్న మార్కెట్‌కు ర‌వాణా చేయ‌డం వంటి వివిధ పనుల‌కు అవ‌స‌ర‌మైన కూలీల ల‌భ్య‌త చాలా క‌ష్టంగా మారింది.

ప‌రిస్థితి ద‌య‌నీయంగా..

ఇంత చేసినా వ్యాపారుల వ‌ద్ద‌కు తీసుకెళ్తున్న రైతుల‌కు స‌రైన ధ‌ర లభించడంలేదు. క్వింటాల్‌కు రూ.2500 మించి ప‌ల‌క‌డం లేదంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి మామిడి కొనుగోళ్ల ప్రారంభ దశలో క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.8000 వరకు ఉండాల్సి ఉండగా, ప్రారంభ ధర రూ.3500లుగా పలికింది. వారం క్రితం వ‌ర‌కు కూడా క్వింటా ల్‌కు రూ.3200 ఉన్న ధర బుధవారం క్వింటాల్‌కు రూ.2500 నుంచి రూ.2800 వరకు పడిపోయింది. ఇక‌ నేల రాలిన పంటను క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1200 లకే కొనుగోలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో ఎగుమతి చేసేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయంటూ వ్యాపారులు సాకుగా చూపుతూ ధర తగ్గించేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది పంట దిగుబడి తగ్గిందని ఓవైపు రైతులు ఆందోళన చెందుతుంటే.. వ్యాపారులు ధర తగ్గించడంతో తీవ్ర న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని రైతులు బాధ‌ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో పంట దిగుబ‌డి బాగా త‌గ్గింద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే స‌హ‌జంగా మార్కెట్లో మామిడి కొర‌త ఏర్ప‌డి ధ‌ర పెరుగుతుంద‌ని రైతులు అంచనా వేసినా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్తంభించ‌డంతో మామిడి అమ్మ‌కాల‌కు ఆటంకం ఏర్ప‌డుతోన్నది. మామిడి రైతులు మామిడి కాయలను విక్ర‌యించుకునేందుకు అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నా కంటితుడుపు చ‌ర్య‌లుగానే మిగులుతున్నాయ‌నే చెప్పాలి.

Tags: Khammam, Farmers, Mangoes, Lockdown Affect, Markets

Advertisement

Next Story

Most Viewed